- Advertisement -
బన్సీలాల్ పేట్ స్కూలును హైస్కూలు చేసేందుకు కృషి
Efforts to make Bansilal Pate School a High School
సికింద్రాబాద్
వచ్చే విద్యా సంవత్సరం నుండి బన్సీలాల్ పేట డివిజన్ లోని మేకల మండి ప్రాథమికోన్నత పాఠశాల ను ఉన్నత పాఠశాల (హై స్కూల్) గా అప్ గ్రేడ్ చేయించేందుకు కృషి చేస్తానని మాజీమంత్రి, సనత్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. బుధవారం మేకల మండి పాఠశాలలో 1.80 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న అదనపు తరగతి గదులను తలసాని అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతి పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జీ ప్లస్ 2 విధానంలో 16 తరగతి గదుల నిర్మాణం చేపట్టగా, పనులు ముగింపు దశకు చేరుకున్నాయని అధికారులు వివరించారు. ప్రస్తుతం 7 వ తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో 614 మంది వరకు విద్యార్ధులు ఉన్నారని, హై స్కూల్ గా అప్ గ్రేడ్ చేస్తే విద్యార్ధులకు ఎంతో మేలు జరుగుతుందని, అందుకు సహకరించాలని, అదనంగా మరో 6 తరగతి గదులు మంజూరు చేయించాలని స్కూల్ డెవెలప్మెంట్ కమిటీ సభ్యులు తలసానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల భవిష్యత్ కు విద్య ఎంతో ప్రధానమని, వారికి బంగారు భవిష్యత్ ను అందించాలనే లక్ష్యంతోనే స్కూల్ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కృషి చేస్తూ వస్తున్నానని గుర్తుచేశారు. 30 మంది విద్యార్ధులతో ప్రారంభమైన స్కూల్ లో విద్యార్దుల సంఖ్య నేడు 617 మందికి చేరుకోవడం చాలా సంతోషించదగ్గ విషయమని చెప్పారు. ఈ స్కూల్ పరిసరాలలో ఉండే వారంతా నిరుపెదలేనని, వేలాది రూపాయలు చెల్లించి తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్ కు పంపించే స్థోమత లేదని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని స్కూల్ అభివృద్ధి లో భాగంగా 16 తరగతి గదుల నిర్మాణం కోసం సర్వ శిక్ష అభియాన్ నుండి 1.15 కోట్ల రూపాయలు మంజూరు చేయించానని, ఆ నిధులు సరిపోవని నా దృష్టికి తీసుకు రాగా తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి 65 లక్షల రూపాయలను మంజూరు చేసినట్లు వివరించారు. 7 వ తరగతి అనంతరం విద్యార్ధులకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రాథమికోన్నత పాఠశాల ను హై స్కూల్ గా అప్ గ్రేడ్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న జిల్లా విద్యా శాఖ అధికారి రోహిణి నిఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. తల్లిదండ్రులు కూడా తరచుగా స్కూల్ కు వస్తూ తమ పిల్లల అటెండెన్స్, వారు చదువుతున్న తీరు గురించి టీచర్స్ ను అడిగి తెలుసుకోవాలని కోరారు. సక్రమంగా చదువుకునే విధంగా పర్యవేక్షణ చేయాలని అన్నారు. స్కూల్ అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తున్న స్కూల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులను, మాజీ ప్రధానోపాధ్యాయుడు మల్లిఖార్జున్ రెడ్డి ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. స్కూల్ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా సహకరిస్తున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్కూల్ డెవెలప్మెంట్ కమిటీ సభ్యులు, విద్యార్ధుల తల్లిదండ్రులు, టీచర్స్ కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -