Monday, December 23, 2024

కేసీఆర్ ఫ్యామిలీకి ఎన్నికల సవాల్

- Advertisement -

కేసీఆర్ ఫ్యామిలీకి ఎన్నికల సవాల్
హైదరాబాద్, మార్చి 7
మరో వారం రోజుల్లో పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ రావడం ఖాయం. ఈమేరు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. పార్టీలు కూడా ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. అయితే తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్‌ ఎంపీలు పార్టీని వీడారు. మరో ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగా సీఎంను కలుస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే అని చెబుతున్నా.. పార్టీ మారుతారనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఇలాంటి తరుణంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి బయట పడాలంటే బీఆర్‌ఎస్‌ కనీసం సిట్టింగ్‌ స్థానాలను అయినా నిలబెట్టుకోవాలి. గత ఎన్నికల్లో 9 స్థానాలు గెలిచిన బీఆర్‌ఎస్‌ ఇప్పుడు వాటిలో మూడోవంతు కూడా గెలిచే పరిస్థితి లేదని గులాబీ భవన్‌లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.బీఆర్‌ఎస్‌ ఒక కుటుంబ పార్టీ. ఇది ఎవరూ కాదనలేదు. ఆ కుటుంబంలో యాక్టివ్‌ పాలిటిక్స్‌ చేసేవారిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత. కవిత, కేసీఆర్‌ గతంలో ఎంపీలుగా పనిచేశారు. తాజాగా కేటీఆర్‌ కూడా మల్కాజ్‌గిరిలో చూసుకుందాం రా అంటూ రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ తరఫున కేసీఆర్‌ కుటుంబంలో ఒకరిద్దరు పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు.బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎన్నికలకు సిద్ధం చేస్తున్నట్లు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ, క్యాడర్‌లో ఎక్కడా ఉత్సాహం కనిపించడం లేదు. మరోవైపు పార్టీని వీడుతున్నవారు పెరుగుతున్నారు. దీంతో క్యాడర్‌లో నైరాశ్యం కనిపిస్తోంది. ఇప్పటికే ముగ్గురు ఎంపీలు పార్టీని వీడారు. ఐదారుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కీలక నేతలు కూడా పార్టీని వీడారు. మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్‌లు కాంగ్రెస్‌ వశం అవుతున్నాయి. ఈ తరుణంలో లోక్‌సభ ఎన్నికల్లో గెలవడం బీఆర్‌ఎస్‌కు సవాల్‌గా మారింది.కేసీఆర్‌ కుటుంబంలో ప్రస్తుత పరిస్థితిలో కవిత ఒక్కరే ఎంపీగా పోటీ చేసే అవకాశం కనిపిస్తుది. కేసీఆర్‌ మెదక్‌ నుంచి బరిలో ఉంటారని ప్రచారం జరుగుతున్నా స్పష్టత లేదు. కేటీఆర్‌ సవాల్‌ కేవలం రేవంత్‌ను రెచ్చగొట్టడానికే. పార్టీ పరిస్థితుల దృష్టా కేసీఆర్‌ లేదా కేటీఆర్‌ ఎంపీగా పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉండే అవకావం కనిపిస్తోంది. తెలంగాణలో ప్రీపోల్‌ సర్వే చేసిన పలు సంస్థలు కూడా ఇదే విషయాన్ని నిర్ధారించాయి. అన్ని సర్వేల్లో బీఆర్‌ఎస్‌ ఒకటి రెండు సీట్లు మాత్రమే గెలుస్తుందని తెలిపాయి. అంటే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను పట్టించుకునే అవకాశం కనిపించడం లేదు. ఇది బీఆర్‌ఎస్‌ ఉనికికే ప్రమాదం. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకుంటే.. ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ బీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే ఉంటుందని అంటున్నారు. అయితే మాటలతో కాకుండా చేతల్లో చూపించేలా కేసీఆర్‌ కుటుంబం నుంచి పోటీ చేయాలని క్యాడర్‌ కోరుతోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్