హైదరాబాద్: ఎన్నికల నియమావళిని, రాజ్యంగం పౌరులకు కల్పించిన హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్న జవహర్‌లాల్ నెహ్రు జర్నలిస్ట్ మ్యూచువల్ ఎయిడెడ్ కోపరేటీవ్ హౌసింగ్ సొసైటీ పాలకవర్గంపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బాచుపల్లి పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్లు కేసు నమోదు చేసినట్లు జేఎన్‌జే సభ్యులు అశోక్‌రెడ్డి, రమణరావులు సంయుక్త ప్రకటనలో తెలిపారు. .
రాష్ట్రంలోని అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు వేసినా, వ్యతిరేకంగా ప్రచారం చేసినా కఠిన చర్యలు ఉంటాయని బెదిరిస్తూ గత నెల 24న జేఎన్‌జే పాలకవర్గం ఓ పత్రికా ప్రకటన విడుదల చేయడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. ఎన్నికల నియమావళికి, రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకమైన హెచ్చరికలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా బాచుపల్లి పోలీసులను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జేఎన్‌జే అధ్యక్షుడు క్రాంతికిరణ్, ఉపాధ్యక్షుడు పల్లె రవి, కార్యదర్శి వంశీ శ్రీనివాస్, డైరక్టర్లు జ్యోతి ప్రసాద్, రవికాంత్‌రెడ్డిలపై ఐపీసీలోని 171సీ, 171ఎఫ్, 506 సెక్షన్ల కింద కింద బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎన్నికల నియమ నిబంధనలు అనుసరించి ఎన్నికలల్లో పోటీ చేసే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిందని జేఎన్‌జే సభ్యులు అశోక్‌రెడ్డి, రమణరావు గురువారం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే తమ హక్కులకు భంగం కలిగినప్పుడు శాంతియుత మార్గంలో నిరసన తెలియజేసే హక్కును కూడా మన రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేశారు. రాజ్యంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రతికా ప్రకటనలు ఇవ్వడాన్ని జేఎన్‌జే సభ్యులు ఆ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్ జర్నలిస్టులు మార్కెట్ ధర ప్రకారం కొనుక్కున్న భూములను స్వాధీనం చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినా కూడా ప్రభుత్వం స్పందించలేదని జేఎన్‌జే సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. `సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మేం కొన్న భూములను స్వాధీనం చేయాలని మేం వివిధ రకాలు విజ్ఞప్తులు చేసినా,గాంధేయమార్గంలో వివిధ మార్గాల్లో తమ నిరసన తెలియజేసినా ప్రయోజనం కలుగ లేదు` అని జేఎన్‌జే సభ్యులు అశోక్‌రెడ్డి, రమణరావులు పేర్కొన్నారు.దీంతో తమకు జరుగుతున్న అన్యాయాన్ని సమాజానికి తెలిపేందుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సభ్యులం నిర్ణయం తీసుకొని, నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో .. సభ్యులను భయబ్రాంతులకు గురిచేసేలా పాలకవర్గం పత్రికా ప్రకటన ఇవ్వడం రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులను కాలరాయడమేనని జేఎన్‌జే సభ్యులు అశోక్‌రెడ్డి, రమణరావు తెలిపారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో జరుగుతున్న ఎన్నికల్లో దేశ పౌరులు ఎవరైనా పోటీ చేయవచ్చు .. కానీ పాలకవర్గం పౌరుల హక్కులకు, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేలా ప్రకటనలు ఇవ్వడం వారి బరితెగింపు, అహంకారం, నియంతృత్వానికి పరకాష్ట అని పేర్కొన్నారు. రాజకీయాలతో సంబంధం లేదంటూనే తమ సొసైటీని బీఆర్‌ఎస్ అనుబంధ సంస్ధగా మారుస్తున్న పాలకవర్గంపై ధ్వజమెత్తారు.
ఇప్పటికే 70 మంది వరకూ సభ్యులు చనిపోయారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వ అధికారులు గౌరవిస్తూ తాము కొనుక్కున్న భూములు స్వాధీనం చేయాలని వారు కోరారు.
1). ఫొటో : ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్న జేఎన్‌జే సభ్యులు
2). ఎన్నికల నియమావళికి విరుద్ధంగా జేఎన్‌జే పాలకవర్గం పత్రికా ప్రకటన
3). ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన లెటర్
4). బాచుపల్లి పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్