- Advertisement -
మూడు దశల్లో బ్యాలెట్ విధానంలో ఎన్నికలు
Elections will be conducted in three phases by ballot system
హైదరాబాద్, సెప్టెంబర్ 2, (న్యూస్ పల్స్)
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో పలువురు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయిపోయన నేతలు ప్రజలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మంచి చెడులకు హాజరై.. ప్రతి సందర్భాన్ని వాడుకుంటూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్‌ల పదవీ కాలం పూర్తయింది. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలపై నిర్వహణపై తెలంగాణ ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) పార్థసారథి కీలక ప్రకటన జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు.శనివారం పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్‌ఈసీ సమావేశమయ్యారు. నోటిఫికేషన్ వచ్చే వరకూ ఓటర్ల నమోదు కొనసాగుతుందని చెప్పారు. ఈనెల 6న ముసాయిదా జాబితా రిలీజ్ చేస్తామని తెలిపారు. మెుత్తం మూడు దశల్లో బ్యాలెట్ విధానంలో ఎన్నికలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల జాబితాల ఆధారంగా వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను ప్రస్తుతం రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.పంచాయతీ ఎన్నికలకు ప్రవర్తనా నియమావళి (కోడ్) ఈసారి కఠినంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా, కులగణన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని విపక్షాలు ఎస్‌ఈసీని కోరాయి. BC రిజర్వేషన్లలను 42 శాతం పెంచాలని డిమాండ్ చేశాయి. అయితే ఈ అంశం తమ పరిధిలో లేదని.. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్లు ఖరారు చేస్తుందని ఎస్‌ఈసీ వెల్లడించారు.కాగా, రాష్ట్రంలో 540 గ్రామీణ మండలాల్లోని 12,966 గ్రామాల్లో 1,14,620 వార్డులు పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. వీటి జాబితాను పంచాయతీరాజ్ శాఖ తాజాగా ఈసీకి సమర్పించింది. గత ఎన్నికల్లో 535 మండలాల్లోని 12,732 గ్రామాల్లో ( మెుత్తం 1,13,152 వార్డులు) ఎన్నికలు జరిగాయి. గతంతో పోలిస్తే ఈసారి 5 మండలాలు, 234 గ్రామాలు, 1,468 వార్డులు పెరిగాయి. ఈసారి అత్యధికంగా నల్గొండ జిల్లాలో 868 గ్రామాల్లోని 7,482 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.
- Advertisement -