మహానాడులో అంతా చినబాబుదే
కడప, మే 28, (వాయిస్ టుడే)
Everything in Mahanadu belongs to Chinababu
కడప మహానాడులో నారా లోకేశ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మహానాడు వేదికగా ఆరు శాసనాలను ప్రకటించారు. నారా లోకేశ్ ప్రసంగం కూడా కార్యకర్తలే తనకు అధినేతలు ఆయన చెప్పుకొచ్చారు. భవిష్యత్ లో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకే పెద్దపీట వేస్తుందని కూడా మహానాడు వేదికగా లోకేశ్ హామీ ఇచ్చారు. కార్యకర్తలు నేతలపైన ఆధారపడవద్దని జనంలోకి వెళ్లాలని, అప్పుడే వెతుక్కుంటూ తెలుగుదేశం పార్టీ మీ వెంట వస్తుందని నారా లోకేశ్ అసలు సీక్రెట్ చెప్పుకొచ్చారు. కార్యకర్తల సంక్షేమానికి తమ పార్టీ ఎప్పడూ పాటుపడుతూనే ఉంటుందని, అందుకే దేశంలో ఏ పార్టీకి లేనంతగా కోటి సభ్యత్వాలు ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉన్నాయని లోకేశ్ అన్నారు.. ఇక నారా లోకేశ్ ఈ మహనాడులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికవుతారన్న ప్రచారం ఊపందుకోవడంతో ఉన్నత స్థాయిలో ఉన్న నేతల నుంచి దిగువ స్థాయి నేతల వరకూ నారా లోకేశ్ దృష్టిలో పడటానికి ప్రయత్నించేందుకు ఎక్కువ పాటుపడుతున్నట్లు కనిపించింది. నారా లోకేశ్ ప్రసంగానికి మంచి రెస్పాన్స్ రావడం బట్టి లోకేశ్ నాయకత్వాన్ని తాము సమర్థిస్తున్నామని చప్పట్లతో చెప్పకనే నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు చెప్పేశారు. ప్రధానంగా తనకు పుంగనూరులో అంజిరెడ్డి తాత, మంజుల అక్క, పల్నాడులో తోట చంద్రయ్య తనకు స్పూర్తి అంటూ చెప్పుకొచ్చిన లోకేశ్ వారిని ఆదర్శంగా తీసుకుని తాను ముందుకు వెళతానని కూడా చెప్పుకొచ్చి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు… నారా లోకేశ్ కు ఈ మహానాడు ఎంతో ప్రత్యేకం. ఇప్పటి వరకూ ఎన్ని మహానాడులు జరిగినప్పటికీ గత మహానాడులో పార్టీ అధికారంలో లేదు. అయినా లోకేశ్ అప్పుడు తన ప్రసంగంతో కొంత కార్యకర్తల్లో ఉత్సాహం నింపినా, కడప జిల్లాలో జరిగే మహానాడు మాత్రం తనలోని నాయకుడిని కార్యకర్తలకు చూపించిన తర్వాత మాత్రమే ఆయన లీడర్ గా ఎదిగానని చెప్పుకోవడానికి ఏమాత్రం సంకోచించలేదు. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయిన మంగళగిరి నుంచి మాత్రమే పోటీ చేసి తిరిగి గెలవడంతో పాటు యువగళం పాదయాత్రతో కార్యకర్తలను, నేతలను ఏకం చేయడంలో లోకేశ్ సక్సెస్ అయిన తీరు కూడా పార్టీలో ఆయన ఎదుగుదలకు కారణమయిందని చెప్పాలి. అందుకే లోకేశ్ వెనక ఎవరు ఉన్నారన్నది పక్కన పెడితే ఆయన ఆలోచనలు, తీసుకునే నిర్ణయాలు, అందుబాటులో ఉండే సమయం వంటివి అదనపు బలాలుగా మారాయని చెప్పకతప్పదు.
పదవులు తెచ్చే వేదిక
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తాయి. తెలుగుదేశం పార్టీ స్ధాపించి దాదాపు నాలుగు వసంతాలు కావడంతో అక్కడ పుట్టి.. పెరిగిన రాజకీయ నేతలు తర్వాత మంచి స్థానంలోకి వెళ్లారు. కొందరు ముఖ్యమంత్రులు కాగా, మరికొందరు కీలకమైన మంత్రి పదవులను దక్కించుకున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చి బయటకు వెళ్లిన వారు ఇతర పార్టీల్లో చేరి మంత్రులుగా చేరిన వారు అధికంగా కనిపించే వారు. కానీ ఇప్పుడు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్లే మంత్రులు, ముఖ్యమంత్రులుగా అధికంగా ఉండటం కనిపిస్తుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్లు వివిధ కారణాలతో పార్టీ మారి ముఖ్యమంత్రులగానో, మంత్రులుగానో మారిపోయారు. తాజాగా మహానాడు కడపలో జరుగుతున్న సమయంలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ హయాం నుంచి మహానాడు ప్రారంభమయింది. నాడు మహానాడులో పాల్గొని తర్వాత రాజకీయాల్లో ఉన్నత స్థాయికి వెళ్లిన వారు, అమాత్యపదవులు అందుకున్న వారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ మంది పొలిటీషియన్స్ తెలుగుదేశం పార్టీలో రాజకీయ ఓనమాలు దిద్ది తర్వాత ఎదిగి బుగ్గకార్లు ఎక్కిన వారు అనేక మంది ఉన్నారు. మహానాడులో ఇది చర్చనీయాంశంగా మారింది. అతెందుకు రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణకు ముఖ్యమంత్రులు అయిన ఇద్దరూ టీడీపీకిచెందిన వారే. కేసీఆర్, రేవంత్ రెడ్డి అక్కడి నుంచి వచ్చిన వారే. నాడు జరిగిన మహానాడులో వారు చేసిన ఉపన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అందుకే నేటి తరం రాజకీయ నేతలకు మహానాడుతో విడదీయరాని బంధం ఉంది. నాడు మహానాడు వేదికపై ఉన్న రోజా, అవంతి శ్రీనివాస్, కొడాలి నాని, విడదల రజిని వంటి వారు వైసీపీ హయాంలో మంత్రులయ్యారు. ఇక కేసీఆర్ పదేళ్లు పాటు అధికారంలో ఉన్నప్పుడు కేబినెట్ లో ఉన్న వారిలో ఎక్కువ మంది టీడీపీ నుంచి వచ్చిన వారే. గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస యాదవ్ వంటి వారు మంత్రి పదవులు దక్కించుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్ లోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క వంటి వారు కూడా టీడీపీ నుంచి ఓనమాలు నేర్చుకుని వచ్చిన వారే. అందుకే టీడీపీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా ఎదిగేందుకు వేదికగా మారిందని చెప్పాలి.