హైదరాబాద్, అక్టోబరు 21, (వాయిస్ టుడే): కాంగ్రెస్ పార్టీకి ఫేక్ జాబితాతో పార్టీ శ్రేణులకు భయం పట్టుకుంది. 14 మందితో జాబితా విడుదల అంటూ పోస్టులు వైరల్ కావడంతో శ్రేణుల్లో గుబులు నెలకొంది. ఆరు పేర్లతో మరో జాబితా అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. మొదటి 14 పేర్లలో మహేశ్వరం ఒకరి పేరు.. రెండో లిస్ట్ లో ఇంకో పేరు ఉండటంతో కాంగ్రెస్ క్యాడర్ లో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో.. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ఆశావహులు కలుస్తున్నారు. ఆఖరి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. నిజంగానే 14 మందితో జాబితా విడుదల చేశారా? అనే అనుమానాలతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను పార్టీ శ్రేణులు కలుస్తున్నారు. అసలు ఇలాంటి ఫేక్ జాబితాలను ఎవరు సృష్టిస్తున్నారు?.. ఈ వార్తలపై కాంగ్రెస్ అధిష్టానం సమాధానం కోసం హస్తం నేతలు వేచి చూస్తున్నారు.ఇటివలే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ రిలీజ్ చేసింది. 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి జాబితాలో 55 మందికి స్థానం కల్పించారు.
బీఆర్‌ఎస్‌ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావుతో పాటు ఆయన కుమారుడికి కూడా టికెట్ ఖాయమైంది. మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి, ఆయన కుమారుడు రోహిత్ మెదక్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ పీసీసీ, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు కూడా టికెట్ దక్కింది. కోదాడ నుంచి ఉత్తమ్ హుజూర్ నగర్, పద్మావతి బరిలోకి దిగుతున్నారు.భద్రాచలం టికెట్ కమ్యూనిస్టులకే కేటాయిస్తారని ప్రచారం జరిగినా కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే పొడెం వీరయ్యకు టికెట్ ఖరారు చేసింది. జానా రెడ్డికి బదులు ఆయన కుమారుడు జయవీర్ ఈసారి నాగార్జునసాగర్ బరిలో నిలవనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి, ఎంపీ కోమటిరెడ్డి నల్గొండ నుంచి, భట్టి వికమార్క మధిర నుంచి పోటీ చేయనున్నారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై తూమకుంట నర్సారెడ్డి పోటీ చేస్తున్నారు. జగిత్యాల నుంచి సీనియర్ నేత జీవన్ రెడ్డి, కొల్లాపూర్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి కూచకుళ్ల రాజేష్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. వామపక్షాలతో పొత్తులో భాగంగా సీపీఐకి చెన్నూరు, కొత్తగూడెం స్థానాలు ఖరారైన సంగతి తెలిసిందే. సీపీఎంతో చర్చలు జరిపి పొత్తును విడనాడి మిగిలిన సీట్లను ప్రకటించాలని కాంగ్రెస్ భావించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఫేక్ లిస్ట్ హల్ చల్ చేయడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. మరి దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.