ఎగుమతి రకాల వరి సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి ..కేబినెట్ సబ్ కమిటీకి వ్యవసాయ నిపుణుల కీలక సూచనలు

- Advertisement -

ఎగుమతి రకాల వరి సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి

8 రకాల వంగడాలతో రైతులకు అధిక లాభాలు.. విదేశాల్లో తెలంగాణ బియ్యానికి భారీ డిమాండ్

కేబినెట్ సబ్ కమిటీకి వ్యవసాయ నిపుణుల కీలక సూచనలు

Farmers need to be widely educated on the cultivation of export-quality paddy varieties; agricultural experts offer key suggestions to the Cabinet sub-committee.

హైదరాబాద్, జూన్ 15: దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అధిక డిమాండ్ ఉన్న మేలురకం వరి వంగడాల సాగుపై రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి సూచించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాభవన్‌లో సోమవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఈ సూచనలు చేశారు.

సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి. శ్రీధర్ బాబు హాజరయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి, ధాన్యం కొనుగోలు, నిల్వ సదుపాయాలు, వానాకాలం సాగు అంశాలపై కేబినెట్ సబ్ కమిటీ సమగ్రంగా సమీక్షించింది.

ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రైతులకు లాభదాయకంగా, ఎగుమతులకు అనుకూలంగా ఉన్న ఎనిమిది వరి వంగడాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సూచించారు. బీపీటీ-5204, తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్-15048), కేఎన్‌ఎం-1638, జై శ్రీరామ్, హెచ్ఎంటీ, డబ్ల్యూజీఎల్-962, డబ్ల్యూజీఎల్-44, జేజీఎల్-1798 రకాల సాగును విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ప్రతిపాదించారు.

ఈ వంగడాలకు దేశీయ మార్కెట్‌తో పాటు అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో కూడా అధిక డిమాండ్ ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో ప్రభుత్వ కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కంటే ఎక్కువ ధర లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ రకాల విత్తనాల కొరత కూడా మార్కెట్లో లేదని, రైతులు సులభంగా సాగు చేయవచ్చని వివరించారు.

రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల ప్రభావం నుంచి రక్షణ కల్పించడంలో ఈ వంగడాల సాగు కీలకమని నిపుణులు అభిప్రాయపడ్డారు. గ్రామ స్థాయిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులను ప్రోత్సహించాలని సూచించారు.

సమావేశంలో సివిల్ సప్లై అధికారులు మాట్లాడుతూ, రాష్ట్రంలో సాగవుతున్న అన్ని రకాల సన్నబియ్యానికి మార్కెట్లో సమానమైన ఆదరణ లభించడం లేదన్నారు. కొన్ని రకాల వరి మిల్లింగ్ సమయంలో ఎక్కువగా విరిగిపోతుండటంతో పాటు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా లేకపోవడంతో మిల్లర్లు, వ్యాపారులు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని వివరించారు.

వినియోగదారులు, మిల్లర్లు, వ్యాపారులకు అనుకూలంగా ఉండే, అంతర్జాతీయ ఎగుమతులకు అనువైన నిర్దిష్ట వరి రకాలను మాత్రమే ప్రోత్సహించాలని, డిమాండ్ లేని రకాల సాగును క్రమంగా తగ్గించాలని అధికారులు సూచించారు. దీంతో మిల్లర్లు నేరుగా రైతుల వద్దకే వెళ్లి మంచి ధరలకు ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి వివరించారు. భవిష్యత్తులో రైతులకు నష్టాలు తలెత్తకుండా మార్కెట్ డిమాండ్ ఆధారిత పంటలను ప్రోత్సహించడం అవసరమని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి సురేందర్ మోహన్, వ్యవసాయ శాఖ కమిషనర్ గోపీ, మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్ రాజ్, సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular