- టూరిస్ట్ హాట్‌స్పాట్‌లో కొట్టుకుని పోయిన కార్లు
నైతుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాల దాటికి ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ప్రకృతి ప్రకోపంతో హిమాచల్‌ప్రదేశ్ తల్లడిల్లిపోతోంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లోని వరద ఉధృతికి కొట్టుకుని పోయిన కార్ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజా సంఘటన రాష్ట్రంలోని సోలన్ జిల్లాలోని పర్వానూ అనే పర్యాటక ప్రదేశంలో జరిగినట్లు తెలుస్తోంది.
సమీపంలోని బాల్కనీలపై ఉన్న వ్యక్తులు కేకలు వేస్తూ ఆ నీటిలో కొట్టుకుని పోతున్న కార్లను తమ మొబైల్‌లో బంధింస్తున్నట్లు వీడియో చూపించింది. గత కొన్ని గంటల పాటు కురిసిన భారీతో వర్షం వీధులన్నీ జలమయం అయ్యాయి. వరద ఉధృతికి వంతెనలు కొట్టుకుపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజల జీవితం అగమ్యగోచరంగా మారింది. అంతేకాదు రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అందరూ ఇళ్లలోనే ఉండమని ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
చండీగఢ్-మనాలి జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా పలు చోట్ల రహదారులు మూసుకుపోయింది. సిమ్లా-కిన్నౌర్ రహదారి కూడా స్లైడ్‌లు, రాళ్లు పడిపోవడం వల్ల వాహనాల రాకపోకలకు మూసివేశారు. ఆకస్మిక వరదలకు కొన్ని జిల్లాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. వంతెనలు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలు, వరదలతో ఏర్పడిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని.. రూ. 3,000-4000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.