తెలంగాణ జలాశయాలకు పోటెత్తుతున్న వరద…

- Advertisement -

తెలంగాణ జలాశయాలకు పోటెత్తుతున్న వరద…
ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు, వాగులు, వంకలు
హైదరాబాద్, జూలై 30

Floodwaters surging into Telangana’s reservoirs…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధాన జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో పాటు జూరాల, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల నీటిమట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జలపాతాలు, నదీ తీర ప్రాంతాల వద్ద పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
వివిధ జలాశయాల ప్రస్తుత పరిస్థితి వివరాలు:
జూరాల ప్రాజెక్టు (మహబూబ్‌నగర్):
ఇన్‌ఫ్లో: 91,000 క్యూసెక్కులు. ఔట్‌ఫ్లో: 81,695 క్యూసెక్కులు (10 గేట్లు ఎత్తివేత).
నీటిమట్టం: గరిష్ఠంగా 318.516 మీటర్లకు గాను ప్రస్తుతం 317.35 మీటర్లకు చేరింది.
నీటి నిల్వ: పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.371 టీఎంసీలు నమోదైంది. ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లోని 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి:
ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 27.4 అడుగులకు చేరడంతో తీరప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (నిజామాబాద్):
ఇన్‌ఫ్లో: 6,250 క్యూసెక్కులు.
నీటిమట్టం: పూర్తిస్థాయి 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1065 అడుగులు ఉనంది. 80 టీఎంసీల సామర్థ్యానికి గాను 16 టీఎంసీల నిల్వ ఉంది.
నిజాంసాగర్ ప్రాజెక్ట్ (నిజామాబాద్):
ఇన్‌ఫ్లో: 3,935 క్యూసెక్కులు.
నీటిమట్టం: పూర్తిస్థాయి 1405 అడుగులకు గాను ప్రస్తుతం 1395.83 అడుగులకు చేరింది. 17.802 టీఎంసీల సామర్థ్యానికి గాను 7.146 టీఎంసీల నీరు నిల్వ ఉంది (గత ఏడాది ఇదే సమయానికి 4.622 టీఎంసీలుగా ఉంది).
సింగూరు ప్రాజెక్టు (సంగారెడ్డి):
ఇన్‌ఫ్లో: 517 క్యూసెక్కులు. ఔట్‌ఫ్లో: 470 క్యూసెక్కులు.
నీటి నిల్వ: 29.9 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 4.249 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు-
ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కురుస్తున్న జోరు వానలు అన్నదాతల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటి వరకు సరైన వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న జనం ఇప్పుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరో 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.  కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల లో-లెవెల్ వంతెనల వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. రహదారులు జలమయం అవ్వడంతో మరోవైపు చెట్లు నేలకొరిగి, ఇళ్లు కూలిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు అప్రమత్తమై ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో లింగాపూర్, సిర్పూర్ (యు) మండలాల్లోని పలుచోట్ల లో-లెవెల్ వంతెనలపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. వంతెనలపై నీటి ఉద్ధృతి పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.గుండి గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో డప్పు చాటింపు నిర్వహించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున వాగులు, వంకల వద్దకు వెళ్లొద్దని, చేపల వేటకు దూరంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగల సమీపానికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు.కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల దృష్ట్యా  జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ సూచించారు.
ఆసిఫాబాద్ లోని తుంపెల్లి వాగు, గుండి వాగులు పరిశీలించి, పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. వరద తగ్గిన తర్వాతనే ప్రజలు దాటేందుకు అనుమతి ఇవ్వాలని వరద అధికంగా ఉన్న సమయంలో రాకపోకలు నిలిపివేయాలని ఆదేశించారు. భద్రత చర్యలకు సంబంధించిన సామాగ్రి అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.రానున్న నాలుగు రోజులపాటు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా వాగులు, వంకలు, చెరువులు, నదులు, కల్వర్టులు, లో-లెవల్ బ్రిడ్జిల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రయాణాలు చేయవద్దని, పోలీసు శాఖ ప్రజల భద్రత కోసం వరద ప్రభావిత ప్రాంతాలు, లో-లెవల్ బ్రిడ్జిల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే డయల్–100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి పోలీసు సేవలను వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు.సెల్ఫీలు, రీల్స్ లేదా ఇతర వినోదాల కోసం వరద ప్రాంతాలు, వాగులు, చెరువులు, జలపాతాల వద్దకు వెళ్లి ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవద్దు.ఆసిఫాబాద్ జిల్లాలో వాగుల వద్ద వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ కె. హరిత పరిశీలించారు. ఆసిఫాబాద్ మండలంలోని తుంపెల్లి వాగు వద్ద వరద ప్రవాహ పరిస్థితిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లాలో రాబోయే 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలన్నారు. ఎగువ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులలో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందన్నారు. వంతెనలపై నుంచి వరద నీరు పారే అవకాశం ఉన్నందున, వాహనదారులను, కాలినడకన వచ్చేవారిని వంతెన దాటకుండా నివారిస్తున్నారు. టూవీలర్స్‌, పశువుల కాపరులు పొంగిపొర్లుతున్న వాగులు/వంకల అవతలి వైపునకు వెళ్లకూడదని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదల వల్ల ఎదురయ్యే అత్యవసర సహాయం, సమాచారం కోసం కలెక్టరేట్‌లో 8500844365 నెంబర్‌తో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
మంచిర్యాల జిల్లాలో భారీ వర్షానికి కూలిన ఇళ్లు
మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కోటపల్లి మండలం ఆలుగామ గ్రామంలో ఉదయాన్నే ఇల్లు ఒక్కసారిగా కూలిపోవడంతో గృహిణి తీవ్రంగా గాయపడగా, ఆమె భర్త, పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.మంచిర్యాల జిల్లాలో మంగళవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని ఆలుగామ గ్రామానికి చెందిన ఆత్రం మాంతు కుటుంబం ఇంట్లో నిద్రిస్తుండగా, బుధవారం తెల్లవారున ఆకస్మికంగా వారి ఇల్లు కూలిపోయింది. ఈ ప్రమాదంలో గృహిణి ఆత్రం లక్ష్మి శిథిలాల కింద చిక్కుకుని తీవ్రంగా గాయపడింది. భర్త మాంతు, పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి శిథిలాలను తొలగించి క్షతగాత్రులను బయటకు తీసి 108 అంబులెన్స్ ద్వారా చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఆత్రం లక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో పాత ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎలాంటి ప్రమాద సూచనలు కనిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు.కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు గుండాల వాటర్‌ఫాల్ వద్ద నీటి ప్రవాహం ఉద్ధృతంగా మారింది. జలపాతం నుంచి దూసుకొస్తున్న నీటి ధాటికి చుట్టుపక్కల ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు పర్యాటకులను జలపాతం వద్దకు అనుమతించడం లేదు. ఇంతకుముందు ఇక్కడ ప్రమాదాలు జరిగినందున ప్రజలు, యువకులు సెల్ఫీలు, వీడియోల పేరుతో జలపాతం వద్దకు వెళ్లవద్దని స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలు తగ్గే వరకూ ఆసిఫాబాద్ జిల్లాలో పర్యాటకులకు నిషేధం విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కుంటాల జలపాతానికి భారీ వరద
ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలకు కుంటాల జలపాతం వద్ద భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. పరవళ్ళు తొక్కుతూ అందాల నడుమ వరద ప్రవాహం కనిపిస్తోంది. గత వారం రోజుల క్రితం కుంటాల జలపాతం వద్ద కొంతమేర ప్రవాహం ఉన్నప్పటికీ ప్రస్తుతం రెండు రోజుల ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షానికి మరింత ప్రవాహం ఎక్కువైంది. దీంతో జలపాతం వద్ద భారీగా వరద ఉద్ధృతి ప్రవహిస్తూ కనిపిస్తోంది. ఈ జలపాతం అందాలను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. అయితే జలపాతం వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అవతలి వైపే ఉండేలా అటవీశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. భారీ వరద ఉద్ధృతి ఉన్నందున పర్యాటకులు, వరద ఉద్ధృతి వద్ద స్నానాల కోసం కానీ, సెల్ఫీల కోసం గానీ లోపలి వైపు వెళ్లరాదని, అవతలి వైపు బయటే ఉండి వీక్షించాలని సూచిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular