Sunday, December 15, 2024

హోంశాఖ ప్రక్షాళన పై  ఫోకస్

- Advertisement -

హైదరాబాద్, డిసెంబర్  12, (వాయిస్ టుడే):  హోంశాఖను ప్రస్తుతానికి తన దగ్గరే ఉంచుకున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ శాఖ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టారు. డీజీపీ మొదలు సబ్ డివిజనల్ ఆఫీస్ వరకు మొత్తం వ్యవస్థ ఎలా పనిచేయాలనేదానిపై తనకంటూ ఒక ప్లాన్‌ను రూపొందించుకున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆ దిశలో భాగంగానే త్వరలోనే ఈ శాఖలో టాప్ టు బాటమ్ మార్పులకు శ్రీకారం చుట్టాలనుకుంటున్నరని పేర్కొన్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా హోంశాఖ ఎప్పుడూ ముఖ్యమంత్రి దగ్గర లేదు. ఈసారి మాత్రం మంత్రివర్గ విస్తరణలో కేటాయింపు చేసేంతవరకు స్వయంగా ఆయనే పర్యవేక్షించాలనుకుంటున్నట్లు సమాచారం. పదేండ్ల పాలనలో పోలీసు శాఖపై ప్రజల్లో సదభిప్రాయం లేదని, దీన్ని రూపుమాపడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలిసింది.ప్రస్తుతం అసెంబ్లీ సెషన్ జరుగుతున్నందున.. అది కంప్లీట్ కాగానే పోలీసు శాఖను సంస్కరించడంపైనే సీఎం దృష్టి సారిస్తారని సీఎం సన్నిహిత వర్గాలు తెలిపాయి. స్వయంగా ఆయనే డీజీపీ ఆఫీసుకు వెళ్లి ఉన్నతాధికారులతో సమీక్షిస్తారని సూచనప్రాయంగా వెల్లడించాయి. లోకల్ ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లో పోలీసు అధికారుల బదిలీలు, పోస్టింగులు జరిగాయని, పైరవీలతో ఆ శాఖకు చెడ్డపేరు వచ్చిందనే సాధారణ అభిప్రాయం నెలకొనడంతో దాన్ని పోగొట్టడంపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. అధికార పార్టీకి అనుకూలంగా పోలీసు శాఖ వ్యవహరిస్తున్నదంటూ ప్రజల్లో నెలకొన్న అభిప్రాయమే. అంతేకాకుండా ఇంతకాలం ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నేతల్లోనూ అలాంటి భావనే ఉన్నది.ఇప్పుడు అధికారంలోకి వచ్చినందువల్ల అలాంటి ముద్ర రాకుండా చూడడం అవసరమని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. డీజీపీ మొదలు కింది స్థాయి వరకు పోలీసు అధికారుల పనితీరును, వారిపై ఇప్పటివరకూ వచ్చిన విమర్శలను పరిగణనలోకి తీసుకుని తగిన మార్పులు చేర్పులు చేయకపోతే వ్యవస్థపైనే ప్రజల్లో విశ్వాసం పోయే ప్రమాదం ఉన్నదనే అభిప్రాయానికి వచ్చినట్లు సీఎంకు సన్నిహితంగా ఉన్న పలువురు వ్యాఖ్యానించారు. అధికార పార్టీ సిఫారసులు, పైరవీలకు తావులేకుండా పనిచేసేలా పోలీసులకు ఫ్రీ హ్యాండ్‌ ఇవ్వడం ద్వారా కొత్త ప్రభుత్వం ముద్ర ప్రజలకు విజిబుల్‌గా కనిపించేలా సంస్కరించాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది.పోలీసు శాఖకు బెస్ట్ ఇమేజ్ వచ్చేలా పనితీరును మెరుగుపర్చాలని సీఎం కోరుకుంటున్నట్లు తెలిసింది. పదేండ్ల కాలంలో ఎమ్మెల్యేలు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులను పావులుగా వాడుకున్నారని, ప్రతిపక్షాల శ్రేణుల్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరించారని గతంలో కాంగ్రెస్ లీడర్లతో పాటు బీజేపీ నుంచి కూడా విమర్శలు వచ్చాయి. స్థానికంగా రాజకీయ ప్రత్యర్థులు లేకుండా అక్రమ కేసులు బనాయిస్తున్నారనీ ఆరోపించాయి. స్వయంగా రేవంత్‌రెడ్డి సైతం ఎన్నికల ప్రచారం సమయంలో ఒక్కొక్కరి పేర్లను డైరీలో రాసిపెడుతున్నామని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి చూస్తామని, మిత్తితో సహా వారికి అంతకంత మూల్యం తప్పదని హెచ్చరించారు. వివాదాస్పదంగా ఉన్న పోలీసు అధికారులపై రానున్న రోజుల్లో చర్యలు తప్పవనే మాటలు వినిపిస్తున్నాయి.ఎన్టీఆర్ హయాం నుంచి హోంశాఖకు విడిగా మంత్రులే కొనసాగారు. ఎన్నడూ ఆ శాఖను ముఖ్యమంత్రి తన దగ్గర ఉంచుకోలేదు. వసంత నాగేశ్వరరావు, మైసూరారెడ్డి, ఎలిమినేటి మాధవరెడ్డి, దేవేందర్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జానారెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, మహమూద్ అలీ… ఇలా ప్రత్యేకంగా హోం మంత్రులు ఉన్నారు. కానీ నాలుగు దశాబ్దాల్లో ఫస్ట్ టైమ్ హోంశాఖను కూడా ముఖ్యమంత్రే చూసుకుంటున్నారు. మంత్రివర్గంలో ఇంకా ఆరుగురిని చేర్చుకోవాల్సి ఉన్నందున ఆ ప్రక్రియలో భాగంగా హోంశాఖను వారికి కేటాయిస్తారా?.. లేక ముఖ్యమంత్రి తన దగ్గరే ఉంచుకుంటారా?.. అనేదానిపై ఇప్పటికి స్పష్టత లేదు. ఈ శాఖను సంస్కరించిన తర్వాత ఇతరులకు కేటాయించే అవకాశాలు లేకపోలేదు.భూవివాదాల్లాంటి సివిల్ తగాదాల్లో తలదూర్చడం, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడంతో పోలీసు శాఖపై ప్రజల్లో మంచి అభిప్రాయం లేదన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం. పోలీసు స్టేషన్లలోనే లాండ్ సెటిల్‌మెంట్లు చేస్తున్నారని, అక్రమ ఆదాయానికి అలవాటుపడ్డారనే భావనా జనరల్‌గా ఉన్నది. దొరల పాలన స్థానంలో ప్రజా పాలన అందిస్తామని, ప్రజాభవన్ పేరు పెట్టింది అందుకోసమేనని, ప్రజాస్వామిక పాలన అందుతుందని ప్రజలకు భరోసా ఇచ్చిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు సీఎం హోదాలో దాన్ని అమలుచేయడం అనివార్యంగా మారింది. పోలీసు శాఖపై ప్రజల్లో ఉన్న జనరల్ అభిప్రాయాన్ని తుడిచేసి ‘సంస్కరించబడింది’ అనే భావన నెలకొనేందుకు దీనిని లోతుగా రివ్యూ చేసి మార్పులతో పాటు సమూలంగా ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్