మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రెండో రోజు పులివెందుల పర్యటన
Former Chief Minister YS Jagan visited Pulivendula on the second day
పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్… కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేనున్నాను అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని పలువురు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలని ఆయన సూచించారు. కష్టాలు ఎల్లకాలం ఉండవని, ప్రతి ఒక్కరూ పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు శ్రీ వైయస్ జగన్ సూచించారు.
క్యాంప్ కార్యాలయానికి వచ్చిన అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారానికి చొరవ చూపారు.
వైయస్ జగన్ ప్రజాదర్బార్‌లో ఉల్లి రైతులు కలిసి తమ సమస్యను చెప్పుకున్నారు, ఎకరాకు రూ. లక్ష పెట్టుబడి పెట్టినా కనీసం రవాణా చార్జీలు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కనీస మద్దతు ధర అందుతుందా అని జగన్ వాకబు చేయగా తమకు అలాంటి మేలు ఒకటి కూడా జరగలేదని వారంతా తమ గోడు వెళ్ళబోసుకున్నారు. రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చిన జగన్, వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.