అమరావతిలో చంద్రబాబు సొంత ఇల్లు
9న శంకుస్థాపన
విజయవాడ, మార్చి 31, (వాయిస్ టుడే )
Foundation stone of Chandrababu's own house in Amaravati to be laid on 9th
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో భూమి కొనుగోలు చేశారు. వెలగపూడికి సమీపంలో E-6 రోడ్ లో ఐదు ఎకరాల భూమిని ఆయన కొంతకాలం క్రితం కొన్నారు. ఏప్రిల్ 9న అక్కడ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయబోతున్నారు. ఏప్రిల్ 15 తర్వాత అమరావతి పనుల నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఆరేళ్లగా ఆగిపోయిన ఈ పనులకు ప్రధాని మోదీ మరోసారి శంకుస్థాపన చేయబోతున్నారు. దానికంటే ముందుగానే తన సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ జరిపించాలని చంద్రబాబు భావిస్తున్నారు.రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి చంద్రబాబుపై విపక్షాలు ఎక్కుపెట్టిన ప్రధానమైన విమర్శ ఆయనకు అమరావతిలో సొంత ఇల్లు లేదని. ప్రస్తుతం ఆయన ఉంటున్న ఉండవల్లిలోని నివాసం పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌కు చెందినదని వారి ఆరోపణ. అదే సమయంలో వైసీపీ అధ్యక్షుడు తాడేపల్లిలో తన సొంత ఇల్లు నిర్మాణం చేశారు. 2019కి ముందే గృహప్రవేశ కార్యక్రమం కూడా పూర్తి చేశారు. అప్పట్లో వైసిపి ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ అమరావతిలో చంద్రబాబుకు సొంతిల్లు లేదనీ హైదరాబాదులోనే నివాసం ఉంటూ ఇక్కడ రాజకీయాలు నడిపిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించేవారు.2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం చంద్రబాబు నివాసం ఉంటున్న ఉండవల్లి ఇంటిని ముఖ్యమంత్రి నివాసంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా వెలగపూడి లోని సెక్రటేరియట్ వెనకాల ఐదు ఎకరాల 20 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. VIT కాలేజీకి దగ్గర్లో ఉన్న ఈ స్థలంలో చంద్రబాబు ఇంటికి సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 9న భూమి పూజ చేయడానికి ముహూర్తం నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఇంజనీర్లు ఆ స్థలంలోని మట్టిని పరీక్ష చేశారు. అక్కడ ఇంటి నిర్మాణానికి అనువుగా ఉంటుందా లేదా అనే టెస్టులు కూడా పూర్తయ్యాయి.వెలగపూడి సచివాలయానికి, VIT కాలేజీకి, హైకోర్టు మధ్యలో ఉన్న ఈ స్థలం అమరావతి కోర్ క్యాపిటల్‌కి సెంటర్‌గా ఉండబోతుంది. దానితో ఈ ఏరియా రూపు రేఖలే మారిపోతాయని స్థానికులు అంటున్నారు. ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి తన సొంత ఇంటి కోసం తమ స్థలాల మధ్యలోనే కొంత ఏరియాను కొనడం అక్కడ ఆయన నివాసం రావడం వల్ల రియల్ ఎస్టేట్‌పరంగా కూడా తమ భూములకు మంచి రెట్లు వస్తాయని స్థానిక గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.