హైదరాబాద్, అక్టోబరు 27, (వాయిస్ టుడే): తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు బీఆర్ఎస్ అగ్రనేతలపై పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌లపై రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డిలను నిలబెట్టాలని ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. రెండో జాబితాలో ఇదే హైలెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. గజ్వేల్‌లో ఆయనపై బీజేపీ తరపున ఈటల పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని నిలబెట్టాలనే ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్ చేస్తోంది. కామారెడ్డిలో పోటీకి రేవంత్ రెడ్డి సై అన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కామారెడ్డి ఎవరికీ కంచుకోట కాదు. ఎప్పుడూ ఎకపక్ష ఎన్నికలు జరగలేదు. తెలంగాణ ఉద్యమం హైలో ఉన్నప్పుడు కూడా గట్టి పోటలే జరిగాయి. గంపా గోవర్దన్ 2009లో టిడిపి పక్షాన గెలిచినా, ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి ,టిఆర్‌ఎస్ లో చేరి తిరిగి ఉప ఎన్నికలో విజయం సాధించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతోనే విజయం సాధించారు. గత రెండు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. తక్కువ ఓట్లతోనే గంప గోవర్ధన్ బయటపడ్డారు. ఈ సారి రేవంత్ రెడ్డి బరిలోకి దిగితే.. పరిస్థితి వేరుగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అంచనా వేస్తోంది.
కేటీఆర్, హరీశ్‌లకు గట్టి పోటీనిచ్చేందుకు సీనియర్లను రంగంలోకి దింపాలనే చర్చ కాంగ్రెస్ ఎన్నికల కమిటీలో జరిగిందని తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌కు వారసుడిగా ఎన్నికల బరిలో ఉన్న మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మరో మంత్రి హరీశ్‌రావుపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ చేసేలా.. టికెట్లను ఖరారు చేయాలని ఆలోచిస్తున్నారు. రేవంత్ రెడ్డి పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉత్తమ్, కోమటిరెడ్డిలు హైకమాండ్ కు ఏం చెప్పారన్నదానిపై స్పష్టత లేదు. హైకమాండ్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. మరో వైపు పార్టీలో మరోసారి చేరబోతున్న రాజగోపాల్ రెడ్డి గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఆయన కావాలని అన్నారో.. కాంగ్రెస్ హైకమాండ్ కు అలాంటి ఆలోచన ఉందో స్పష్టత లేదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ సేఫ్ గేమ్ ఆడతారు. కానీ.. తప్పించుకోలేని పరిస్థితిని హైకమాండ్ సృష్టిస్తోందని అంటున్నారు. ఓ రకంగా మగ్గురు అగ్రనేతలకు అగ్నిపరీక్షే. అగ్రనేతలపై అగ్రనేతలు పోటీ పడితే.. ముఖాముఖి తేల్చుకున్నట్లు అవుతుంది. ఆ నియోజకవర్గాలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. అక్కడి పోరాటం రాష్ట్ర స్థాయి ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే… తెలంగాణ ఎన్నికల్లో పోటీ పడేవారి కాంబినేషన్లు సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి