బోర్లు తవ్వినా జాడలేని ‘గంగమ్మ’!
'Gangamma' cannot be traced even after digging boreholes!
అలసిపోయిన అన్నదాత ఆత్మహత్య,
నిర్మల్:
రైతుకు పొలమే జీవితం. అది పచ్చగా కళకళలాడేందుకు ప్రాణం పెడతాడు. ఈ ప్రయాణంలో కట్టు కున్న భార్యను, కన్నబిడ్డలనూ మరిచిపోతాడనేందుకు నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాజురా గ్రామానికి చెందిన రైతు పతాని నడిపి మల్లన్న (56) జీవితమే నిద ర్శనం. పొలంలో నీటి జాడ కనుగొనేందుకు పదేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలితం ఇవ్వకపోవడంతో ఆయన తన సొంత పొలంలోనే ఉరేసుకున్నారు. కుటుంబాన్ని కష్టాల సంద్రంలో వదిలేశారు. మల్లన్నకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె కు వివాహం చేయగా, కుమారుడు పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుని ఉద్యోగ అన్వే షణలో ఉన్నాడు. తమకున్న ఏడెకరాల పొలంలో మల్లన్న వరి, మొక్కజొన్న సాగు చేస్తుండేవారు. సరైన నీటి లభ్యత లేకపోవడంతో పదేళ్ల వ్యవధిలో ఏకంగా 27 బోర్లు వేయించారు. ఒక్కదాంట్లోనూ నీరు పడలేదు. ఎలాగైనా నీరు పొందాలనే తాపత్రయంతో ఈ ఏడాది మరో మూడు బోర్లు తవ్వించారు. ఒక్కటి కూడా ఫలితం ఇవ్వలేదు. 30 బోర్లు తవ్వించినా గంగమ్మ తల్లి కరుణించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మరోవైపు బోర్లు తవ్వించడానికి చేసిన అప్పులు పెరిగిపోయాయి. నానాకష్టాలు పడి చాలావరకు తీర్చేయగా మరో రూ.5 లక్షల వరకు మిగిలాయి. వీటి నుంచి ముక్తి లభించే మార్గం కనిపించకపోవడంతో తన పొలంలోని చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు వదిలారు..