మున్నూరు కాపు లకు తక్షణమే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
తెలంగాణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్…

గత పది సంవత్సరాలనుండి మున్నూరు కాపు లకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నా తమ గోడు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్.మున్నూరు కాపు హక్కుల సాధన కోసం కొండ దేవయ్య పటేల్ అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మున్నూరు కాపు ప్రతినిధులతో కలిసి పొస్టర్ ను విడుదల చేశారు. తదనంతరం జరిగిన ఆత్మీయ సమావేశంలో కొండ దేవయ్య మాట్లాడుతూ బీసీ లలో అత్యధిక జనాభా కల్గిన మున్నూరు కాపు కులస్తులను విస్మరించడం తగదని, అన్ని కులాల వారికి న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి తమ మున్నూరు కాపు కులానికి ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రతీ సంవత్సరం ఐదు వేల కోట్ల రూపాయలు తమకు కేటాయించాలని, మున్నూరు కాపు కుటుంబాలలో ఎక్కువ శాతం రైతులమే నని, ఉమ్మడి రాష్ట్రం లో తమకు జరిగిన న్యాయం కూడా తెలంగాణ రాష్ట్రం సిద్దించాక జరగట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకే కులం ఒకే సంఘం అనే నినాదం తో మున్నూరు కాపుల ఐక్యంగా ఉన్నా తమ కులానికి చెందిన ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు కులానికి ఉన్న సమస్యలపై స్పందించి హక్కుల సాధనకు ముఖ్యమంత్రిని కలిసే విధంగా చర్యలు తీసుకోవాలని, లేనిచో శాంతి యుతంగా ప్రతీ జిల్లాలో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల ఇంటి ముందు ఇదే పోస్టర్ ను ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆర్ వి మహేందర్ పటేల్,కాసారం రమేష్ , వాసాల వెంకటేశ్వర్లు, తేళ్ల హరి కృష్ణ పటేల్, కొత్త కృష్ణ వేణి, రజిత తదితరులు పాల్గొన్నారు.