రాజకీయాలకు గౌతమ్ గంభీర్ గుడ్ బై
న్యూఢిల్లీ, మార్చి2
క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ లోక్‌సభ ఎన్నికల ముందు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా ఉన్న ఆయన ట్విటర్ వేదికగా ఈ విషయం వెల్లడించారు. క్రికెట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెడతానని స్పష్టం చేశారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ప్రధాని నరేంద్ర మోదీని ఈ పోస్ట్‌లో ట్యాగ్ చేశారు. ఇన్నేళ్ల పాటు ప్రజలకు సేవలు అందించేందుకు అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. “రాజకీయ విధుల నుంచి తప్పుకునేందుకు అనుమతినివ్వాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కోరాను. ఇకపై పూర్తి స్థాయిలో క్రికెట్‌పైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఇన్ని రోజుల పాటు ప్రజలకు సేవలందించేందుకు నాకు అవకాశమిచ్చారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. జైహింద్”
– గౌతమ్ గంభీర్, మాజీ బీజేపీ ఎంపీ
2019 మార్చిలో గౌతమ్ గంభీర్ బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఢిల్లీలో ఆ పార్టీకి కీలక నేతగా ఎదిగారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా పోటీ చేసి 6 లక్షలకుపైగా మెజార్టీతో విజయం సాధించారు. ఈ సారి కూడా ఆయన ఎన్నికల బరిలోకి దిగుతారనుకుంటే… ఉన్నట్టుండి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.మరి కొద్ది రోజుల్లోనే IPL సందడి చేయనుంది. ఇప్పటికే కోల్ కత్తా నైట్ రైడర్స్ కి కొత్త మెంటార్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకున్నారు. హెడ్‌కోచ్ చంద్రకాంత్ పండిట్‌తో కలిసి టీమ్‌కి సలహాలు సూచనలు ఇవ్వనున్నారు. 2011-17 మధ్య కాలంలో గౌతమ్ గంభీర్ KKRకి కేప్టెన్‌గా ఉన్నారు. 2012,2014లో టైటిల్ కూడా గెలిచింది కోల్‌కత్తా టీమ్.
రాజకీయాలకు గౌతమ్ గంభీర్ గుడ్ బై
- Advertisement -
- Advertisement -