ఘనంగా రథసప్తమి వేడుకలు
Grand Rathasaptami celebrations
ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వి.వినయ్ చంద్
స్వామివారిని దర్శించుకున్న మంత్రులు,ఎమ్మెల్సీలు,ఎమ్మెల్యే
అర్ధరాత్రి 12.30 గం.ల నుంచే ప్రారంభమైన క్షీరాభిషేకాలు
భారీ ఎత్తున పోలీసు బందోబస్తు
శ్రీకాకుళం, ఫిబ్రవరి 04:
రాష్ట్ర ప్రభుత్వం రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో సుప్రసిధ్ద పుణ్యక్షేత్రమైన అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం అర్ధరాత్రి 12.30 గం.ల నుంచి స్వామి వారికి క్షీరాభిషేకాలు ప్రారంభమయ్యాయి. స్వామివారి నిజరూప దర్శనానికి జిల్లా నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
ముందుగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వాడ్రెవ్ వినయ్ చంద్ పూజలు ప్రారంభించి ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామి వారి నిజరూప దర్శనాన్ని కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్న ప్రజా ప్రతినిధులలో కేంద్ర పౌర విమానయాన శాఖామాత్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, శాసనసభ్యులు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, గౌతు శిరీషా, మాజీ కేంద్ర మంత్రి డా.కిల్లి కృపారాణి, ఎమ్ఎల్సి వరుదు కళ్యాణి, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పిరియా విజయ తదితరులు ఉన్నారు.
స్వామి వారి నిజరూప దర్శించుకున్న అధికారులు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, విశాఖపట్నం డిఐజి శ్రీ గోపీనాథ్ జట్టి, జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి, పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్, రెవిన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష, వేంకటేష్ తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులు భారీగా తరలిరావడంతో భారీఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అరసవల్లికి వచ్చే వాహనాల రాకపోకల ప్రత్యేక దారులమీదుగా మళ్లించారు. జిల్లా యంత్రాంగం, పోలీస్ అధికారులు చేపట్టిన పటిష్ట చర్యలతో భక్తులకు ఎటువంటి అసౌకర్యము లేకుండా నిజరూప దర్శనం త్వరితగతిన జరిగింది. జిల్లా కలెక్టర్ పలుమార్లు స్వయంగా పర్యటించి క్యూలైన్లో ఉన్న వారికి క్యూలైన్లో దర్శనానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీయగా భక్తులు ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానాలు, మంచినీటి సరఫరా, పిల్లలకు పాలు, భక్తులకు మజ్జిగ వంటివి సరఫరా చేశాయి. ఇంద్రపుష్కరిణి గట్టుపై మహిళలు పిడకలపై ఆవుపాలు, బియ్యం, పంచదారతో పరమాన్నం తయారుచేసి, సూర్యనారాయణస్వామికి నివేదించి పూజలు నిర్వహించారు.