- Advertisement -
తెలంగాణలో గ్రీన్ ఎనర్జీ…
Green Energy in Telangana...
ఖమ్మం, జనవరి 3, (వాయిస్ టుడే)
దేశ నిర్మాణంలో, వివిధ రంగాలకు నిపుణులను అందించడంలో ఐఐటీల పాత్ర చాలా గొప్పదని, ఇవి భారతదేశ కలల కర్మాగారాలని ప్రశంసించారు.. తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఐఐటీ కందిలో నిర్వహించిన ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్ వర్క్ షాప్ లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి.. దేశ నిర్మాణంలో ఐఐటీల ప్రాముఖ్యతను వివరించారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించనున్న పాలసీలు, అమలు చేయాలని భావిస్తున్న అనేక అంశాలను ఈ సదస్సులో ప్రస్తావించారు.హైదరాబాద్ ఐఐటీ ఆవిష్కరణలు, అద్భుతమైన పనితీరుకు చిరునామాగా మారిందన్న డిప్యూటీ సీఎం.. ఇవి కేవలం విద్యాసంస్థలు మాత్రమే కాదని.. దేశ నిర్మాణానికి వేదికలు అని అన్నారు. ఐఐటీ హైదరాబాదు ద్వారా ఇప్పటి వరకు 11,500 పరిశోధన ప్రచురణలు, 320 పైగా పేటెంట్లు లభించాలని ప్రశంసించిన భట్టి విక్రమార్క.. ఇక్కడ నుంచి మొదలైన స్టార్టప్ ల ద్వారా రూ.1,500 కోట్ల ఆదాయం సమకూరడం చాలా గొప్ప మార్పుగా చెప్పారు.ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్ కింద మోనాష్ యూనివర్సిటీ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు మొత్తం దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడతాయన్నారు. తెలంగాణలో క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని రూపొందించడంలో ఈ వర్క్ షాప్ సహకార స్ఫూర్తి కి అద్దం పడుతుందని ఆనందం వ్యక్తం చేశారు.దేశీయ విద్యారంగంలో అత్యున్నత విద్యాసంస్థలుగా రూపుదిద్దుకున్న ఐఐటీ సంస్థలను స్థాపించాలనే ఆలోచనకు ఆద్యుడు ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అని గుర్తు చేసిన డిప్యూటీ సీఎం, ఈ సంస్థల్ని ఆధునిక భారతదేశ దేవాలయాలుగా అభివర్ణించారని అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా దేశంలోని పేదరికం, అసమానతల పై పోరాడడానికి అవసరమైన సాధనాలుగా ఐఐటీలను నెహ్రూ అభివర్ణించారని భట్టి విక్రమార్క గుర్తు చేశారు.రాష్ట్రంలోని హైదరాబాద్ విశిష్ట గుర్తింపు సాధిస్తున్న ఐఐటీ ఏర్పాటుకు ఎంతో కృషి జరిగిందన్న భట్టి విక్రమార్క.. నాటి సీఎం, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. వైఎస్ హయాంలోనే ఈ సంస్థలకు హైదరాబాద్ లో పునాదులు పడ్డాయని, ఆ సమయంలో తాను ఎమ్మెల్సీగా భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నానంటూ వ్యాఖ్యానించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పరిశోధనల్ని, సాంకేతికతల వినియోగాన్ని ప్రోత్సహిస్తోందన్న భట్టి విక్రమార్క.. క్లిష్టమైన ఖనిజాలను వెలికి తీసేందుకు సమర్థవంతమైన మార్గాలు కనుగొనడం, స్థిరమైన మైనింగ్ పద్ధతులను రూపొందించడం అవసరమని అన్నారు. అందుకే.. ఈ రంగంలో ప్రత్యేక ప్రోత్సాహకాల్ని ప్రకటించడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ ప్రకారం.. పరిశోధన.. వాటి సంబంధిత సైన్స్ ఆధార కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.క్లిష్టమైన ఖనిజాలు.. పారిశ్రామిక ముడి పదార్థాలు మాత్రమే కాదని, అవి హరిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి ఉపయోగపడతాయని అన్నారు. సోలార్ పవర్ ప్యానెల్స్, విండ్ టర్బైన్లు, ప్రతి ఎలక్ట్రిక్ వాహనం, విద్యుత్తు నిల్వ బ్యాటరీలు వంటివి క్లిష్టమైన ఖనిజాల ద్వారానే తయారవుతాయని అన్నారు. అందుకే.. వాటిని పర్యావరణ అనుకూలంగా వెలికి తీసి రాష్ట్ర, దేశ నిర్మాణానికి వినియోగిస్తామని ప్రకటించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ అనుకూల విధానాలు అనుసరించనుందన్న భట్టి విక్రమార్క… 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించారు. గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీని భవిష్యత్తు ఇంధనం గా భావిస్తున్నామని.. ఈ రంగంలో మరిన్ని పరిశోధనల్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, స్థిరమైన టెక్నాలజీ, శాస్త్రీయ ఆవిష్కరణలలో దేశంలో మొదటి స్థానంలో నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని వెల్లడించారు.
- Advertisement -