అదిలాబాద్ ఎయిర్ పోర్టుకు లైన్ క్లియర్
అదిలాబాద్, జూన్ 24, ( వాయిస్ టుడే)
Green signal for Adilabad airport
వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామికంగా, ఆర్థికంగా సరికొత్త పుంతలు తొక్కబోతోంది. జిల్లా అభివృద్ధికి గేట్‌వేగా మారనున్న అదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయని,
త్వరలోనే దీనికి శంకుస్థాపన జరగనుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అధికారికంగా ప్రకటించారు. ఢిల్లీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారుల మధ్య జరిగిన ముఖాముఖి భేటీలో ఎయిర్‌పోర్ట్
ఏర్పాటుపై అత్యంత కీలకమైన అవగాహన కుదిరిందని, దీంతో జిల్లా ప్రజల దశాబ్దాల కల సాకారం కాబోతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఆదిలాబాద్ విమానాశ్రయ ఏర్పాటుపై ఉన్న అన్ని
అనుమానాలకు ఈ ఢిల్లీ సమావేశం తెరదించిందని ఎమ్మెల్యే వివరించారు. ఎయిర్‌పోర్ట్ కోసం ఇప్పటికే గుర్తించిన 1,880 ఎకరాలకు అదనంగా, రన్‌వే విస్తరణ , భద్రతా ప్రమాణాల దృష్ట్యా మరో 400
ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించనుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కు తక్షణమే 80 ఎకరాలు కేటాయించి, అక్కడ ఆధునిక టెర్మినల్ భవనం, విమాన
రాకపోకలకు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేయడానికి ఒప్పందం కుదిరింది. భూసేకరణ నిధుల విషయమై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. రాష్ట్ర
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తి సానుకూలత వ్యక్తం చేశారని పాయల్ శంకర్ స్పష్టం చేశారు.విమానాశ్రయ పరిధిలోని హైటెన్షన్ విద్యుత్ లైన్ల మార్పిడి కోసం రూ.340 కోట్లు, ఇతర మౌలిక వసతుల
కల్పన కోసం సుమారు రూ.600 కోట్ల వ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఎయిర్‌పోర్ట్ ద్వారా కేవలం ప్రయాణికుల రాకపోకలే కాకుండా, భారీ స్థాయిలో
కార్గో సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల ఆదిలాబాద్ జిల్లాలో ఉత్పత్తయ్యే వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులను దేశ విదేశాలకు నేరుగా ఎగుమతి చేసే సువర్ణావకాశం లభిస్తుందన్నారు.
అంతేకాకుండా, విమానాల నైట్ హాల్టింగ్, రిపేర్ల కోసం ప్రత్యేక హ్యాంగర్లు ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందన్నారు. భూసేకరణ ముగిసిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం రేవంత్
రెడ్డిల చేతుల మీదుగా శంకుస్థాపన చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు.ఎయిర్‌పోర్ట్‌తో పాటు జిల్లా యువతకు మరో భారీ తీపి కబురును ఎమ్మెల్యే పాయల్ శంకర్
అందించారు. ఆదిలాబాద్ రూరల్ మండల పరిధిలోని రామాయి–రాంపూర్ గ్రామాల మధ్య ప్రతిపాదిత ‘రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ’ నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల అనుమతులు దాదాపు
పూర్తయ్యాయని, త్వరలోనే దీనికి కూడా శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. రాబోయే ఒకటి నుంచి రెండేళ్ల వ్యవధిలోనే ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేసి, సిమెంట్ ఉత్పత్తిని ప్రారంభించడమే
లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ భారీ పరిశ్రమ ద్వారా స్థానికంగా ఉండే సుమారు 2,000 మంది నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా , పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ధీమా వ్యక్తం
చేశారు.జిల్లాలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికేలా అదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సున్నపురాయి నిల్వలను టెండర్ల ద్వారా మరికొన్ని సిమెంట్ పరిశ్రమలకు కేటాయించే అంశంపై కేంద్ర ప్రభుత్వం
ప్రాథమిక చర్చలు జరుపుతోందని ఎమ్మెల్యే వెల్లడించారు. జిల్లాకు ఇంతటి భారీ మేలు జరుగుతున్న తరుణంలో ప్రతిపక్షాలు అనవసర రాజకీయ విమర్శలు మానుకుని, అభివృద్ధి పనుల్లో భాగస్వాములు
కావాలని పాయల్ శంకర్ పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్టులకు సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ప్రజల తరఫున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




