Sunday, September 8, 2024

హామీలు అమలు చేసి చూపిస్తాం

- Advertisement -

హామీలు అమలు చేసి చూపిస్తాం
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం
హైదరాబాద్, ఫిబ్రవరి 8
తెలంగాణ ప్రజలు వారి ఆకాంక్షలు ప్రతిబింబించేలా నిజమైన స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం గల పరిపాలనను ఎన్నుకున్నారని గవర్నర్ తమిళిసై అన్నారు. గురువారం తెలంగాణ అసెంబ్లీ  బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. తొలుత కాళోజీ కవితతో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్.. ఈ ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తుందని అన్నారు. ఒకప్పుడు ప్రజాభవన్‌కు అనుమతి లేని ప్రజలకు నేరుగా తమ సమస్యలు చెప్పుకునేలా సిద్ధం చేశామన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించినట్లు గుర్తు చేశారు. ప్రజలకు మేలు చేకూరేలా ఆరు గ్యారెంటీలను అమల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ‘మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం. అప్పుల కుప్పగా మార్తి తమకు అప్పగించిన రాష్ట్రాన్ని పునఃనిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. త్వరలోనే మరో 2 గ్యారెంటీలను అమలు చేస్తాం. అర్హులకు రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అమలు చేస్తాం. దశాబ్ద కాలంలో నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేస్తాం. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతాం.’ అని గవర్నర్ వివరించారు.రాష్ట్రంలో త్వరలోనే కుల గణన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని గవర్నర్ తమిళిసై తెలిపారు. వివిధ కులాలు ముఖ్యంగా వెనుకబడిన తరగతుల సామాజిక విద్యాపరమైన ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ అవకాశాలను అంచనా వేయడానికి అవసరమైన సమాచారాన్ని ఈ ప్రక్రియ ద్వారా సేకరిస్తామన్నారు. ఇంటింటి సర్వే చేపట్టి అందరి వివరాలు సేకరిస్తామని చెప్పారు. ‘సమాజంలో వివక్ష, అణచివేతకు గురైన అన్ని వర్గాలకు న్యాయం చేకూరుస్తాం… సంక్షేమ, అభివృద్ధి కార్యకలాపాలలో భాగంగా రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ , పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, అమర వీరుల కుటుంబాలు, ఇతర అవసరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది.’ అని పేర్కొన్నారు. బడ్జెట్ లో ప్రవేశపెట్టే ప్రతీ రూపాయి ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు చేస్తామని గవర్నర్ తమిళిసై అన్నారు. ‘బడ్జెట్ కేవలం ఒక ఆర్థిక పత్రం మాత్రమే కాదు.. మనం కోరుకున్న ఉమ్మడి భవిష్యత్‌కి ఒక నమూనా. ఇది మన ప్రజల ఆకాంక్షలను అవసరాలను తీర్చడానికి ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీక, బడ్జెట్‌లో నిధులను సమర్థవంతంగా కేటాయించి ఖర్చు చేసే ప్రతి రూపాయి తెలంగాణ సంక్షేమం పురోగతి దోహదపడేలా చేయడాన్ని నా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మనం ఆశిస్తున్న తెలంగాణలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతూ.. ప్రాథమిక హక్కులు పరిరక్షిస్తూ అంబేడ్కర్ స్ఫూర్తి మన కార్యచరణకు మార్గదర్శకంగా ఉంటుంది. బడ్జెట్‌ ప్రక్రియ అనేది కేవలం వార్షిక మొక్కుబడి కాదని గుర్తించుకోవాలి. ఇది మనం ఆశించిన అభివృద్ధికి చోదకంగా ఉంటూ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఎంతో ప్రేమతో ఎన్నుకున్న ప్రజానీకపు ఆకాంక్షలను ప్రతిఫలింప జేస్తుంది.’ అని తెలిపారు.నైపుణ్య విశ్వవిద్యాలయాల ఏర్పాటులో పెట్టుబడి పెట్టి, క్రీడా మౌలిక సదుపాయాలను పెంచడం ద్వారా పోటీ ప్రపంచంలో యువత రాణించడానికి అవసరమైన వృత్తిపరమైన నైపుణ్యాలతో వారిని సన్నద్ధం చేస్తామని గవర్నర్ తెలిపారు. తద్వారా క్రీడలు మన సంస్కృతిలో భాగమయ్యేట్టు చేస్తామన్నారు. ‘క్రీడారంగ సమగ్ర అభివృద్ధికి తీసుకుంటున్న ప్రభుత్వ చర్యలు నిబద్ధతకు తార్కాణం. ఈ చర్యలు ద్వారా తెలంగాణలోని యువత ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించడంతోపాటు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతారు. ఆధునిక క్రీడా సదుపాయాలను కల్పించి, స్థానిక ప్రతిభను ప్రోత్సహిస్తూ జాతీయ అంతర్జాతీయ వేదికలపై రాణిచండానికి ఔత్సాహిక అథ్లెట్లకు ఓ వేదికను ఏర్పాటు చేసే ప్రణాళికలను రూపొందిస్తాం. ఈ చర్యల ద్వారా ఔత్సాహిక క్రీడాకారులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించి, తెలంగాణని క్రీడా రంగంలో అగ్రగామిగా ఎదిగేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.’ అని వివరించారు.ఇప్పటివరకూ నిర్లక్ష్యానికి గురైన మూసీ నదిని ప్రజలకు అన్ని విధాలా ఉపయోగపడేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని గవర్నర్ తమిళిసై అన్నారు. ‘ప్రభుత్వం పెద్ద ఎత్తున మూసీ రివర్‌ ఫ్రంట్ అభివృద్ధి పనులను చేపట్టనుంది. మూసీ మరొకసారి హైదరాబాద్‌ జీవనాడిగా మారనుంది. దాని చుట్టూ ఉన్న మొత్తం పట్టణ ల్యాండ్ స్కేప్‌ పునరుజ్జీవింప చేయడమే లక్ష్యం. నగర తూర్పు, పశ్చిమ భాగాలను అనుసంధానించే రవాణా నెట్‌వర్క్‌ను స్వచ్ఛమైన నీటిని, రివర్ ఫ్రంట్‌ సుందరీకరణ వంటి అంశాలు ఈ ప్రాజెక్టులో అంతర్భాగం. పీపుల్స్ ప్లాజా పాదచారుల జోన్‌లు హాకర్ ప్రాంతాలు, నగరమంతటా పచ్చని ప్రదేశాలు మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు ద్వారా ఏర్పాటు కానున్నాయి. నగరంలోని పురాతన , వారసత్వ ప్రాంతాల పునరుజ్జీవనం వల్ల ప్రజలకు మరింతగా చేరువవుతాయి. ఈ విషయంపై తగు చర్యలు చేపట్టడానికి ఉత్తమ పద్దతులను అవలంభించడానికి ఖ్యాతి గాంచిన జాతీయ అంతర్జాతీయ నమూనాలను అధ్యయనం చేస్తున్నాం. ఇంతకు ముందు చేయని విధంగా పెద్ద ఎత్తున సకాలంలో పర్యావరణ ఆర్థిక మార్పునకు మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెట్‌ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది.’ అని పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్