హర్ ఘర్ తిరంగా.. మనందరి బాధ్యత!
Har ghar tiranga.. all of us are responsible!
– ప్రతి ఒక్కరూ ఈ పండగలో ఉత్సాహంగా పాల్గొనాలి
– జాతీయ సమైక్యతను కాపాడటం మనందరి బాధ్యతన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
– హైదరాబాద్ లోని తన నివాసంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన కిషన్ రెడ్డి దంపతులు
హైదరాబాద్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి కోరారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా.. హైదరాబాద్ లోని తమ నివాసంలో కిషన్ రెడ్డి దంపతులు జాతీయ జెండాను ఎగురవేశారు. మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ప్రజలందరి భాగస్వామ్యంతో ఘనంగా జరుగుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు.
75 ఏళ్ల స్వతంత్ర్య పండుగ సందర్భంగా 23 కోట్ల మంది భారతీయులు తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారని, రేపటి స్వాతంత్ర్య దినోత్సవం వరకు ఈ స్ఫూర్తిని కొనసాగించడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆయన సూచించారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు తిరంగా ర్యాలీలు నిర్వహించి.. ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలన్నారు. దేశ సమైక్యతను కాపాడుకునే ఈ ఉత్సవంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాలుపంచుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. ఆగస్టు 9న దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆగస్టు 15 వరకు కొనసాగనుంది.