19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు..యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

- Advertisement -

19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

విపత్తుల నిర్వహణ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Heavy rains across the state from the 19th; the administration must be fully prepared: Minister Ponguleti Srinivasa Reddy.

హైదరాబాద్, జూన్ 15: రాష్ట్రంలో ఈ నెల 19వ తేదీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

సోమవారం వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే ప్రమాదాలను అంచనా వేసి నివారణ చర్యలు తీసుకోవడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు రెవెన్యూ, విపత్తుల నిర్వహణ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్నాయని, రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల్లో తెలంగాణ అంతటా వ్యాపించే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా జూన్ 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ఊపందుకుని వారం రోజులపాటు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసినట్లు తెలిపారు.

నైరుతి రుతుపవనాలు జూన్ 8న దక్షిణ తెలంగాణలోకి ప్రవేశించి జోగులాంబ గద్వాల జిల్లాను ఆవరించాయని, ప్రస్తుతం హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మీదుగా ఉత్తర సరిహద్దు కొనసాగుతోందన్నారు. జూన్ 14 నాటికి దక్షిణ తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు మధ్య తెలంగాణలోని చాలా జిల్లాలను రుతుపవనాలు తాకినట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో జూన్ 1 నుంచి ఇప్పటివరకు 49.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, సాధారణ వర్షపాతం 54.9 మిల్లీమీటర్లతో పోలిస్తే సుమారు 10 శాతం లోటు ఉందని తెలిపారు.

వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. వర్షాల తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వర్షాకాలం ముగిసే వరకు అన్ని జిల్లాల అధికారులు నిరంతర అప్రమత్తతతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular