- Advertisement -
ఇస్రోకు ‘వంద‘నం
'Hundred' to ISRO
శ్రీహరికోట, జనవరి 29
ఇస్రో వందో రాకెట్ ప్రయోగం తిరుపతిలోని శ్రీహరికోట వేదికగా బుధవారం ఉదయం జరిగింది. షార్ నుంచి ఉదయం 6:23 గంటలకు శాస్త్రవేత్తలు జీఎస్ఎల్‌వీ ఎఫ్ 15 (GSLV F15) రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. నిప్పులు చిమ్ముతూ ఈ రాకెట్… ఎన్‌వీఎస్ – 02 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లింది. ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ శాటిలైట్ స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2,250 కిలోలు. కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో ఇది రెండోది. ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన వి.నారాయణన్‌కు ఇది తొలి ప్రయోగం కావడంతో ఆయనే అన్ని ప్రక్రియలనూ స్వయంగా పర్యవేక్షించారు.ఎన్‌వీఎస్ – 02 ఉపగ్రహం.. ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ కోసం ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలు అందించనుంది. అలాగే, ఉపగ్రహాల కక్ష్య నిర్ధారణకు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత అప్లికేషన్లకు ఈ ఉపగ్రహపు నావిగేషన్ వాడుకోవచ్చు. భారత నావిగేషన్ వ్యవస్థ నావిక్ సిరీస్‌లోని ఈ రెండో ఉపగ్రహం కచ్చితమైన పొజిషన్, వేగం, టైమింగ్‌తో భారత ఉపఖండం అవతల 1500 కి.మీ పరిధి వరకూ యూజర్లకు కచ్చితమైన నావిగేషన్ అందిస్తుందిఇస్రో వందో ప్రయోగం సక్సెస్ కావడంపై ఛైర్మన్ నారాయణన్ హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైందని చెప్పారు. నావిగేషన్ శాటిలైట్‌ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ‘ఈ వందో ప్రయోగం మైలురాయిగా నిలుస్తుంది. ఎన్‌వీఎస్ – 02 ఉపగ్రహం పదేళ్ల పాటు సేవలందిస్తుంది. ఇప్పటివరకూ 6 జనరేషన్ల లాంచ్ వెహికల్స్ అభివృద్ధి చేశాం. 1979లో అబ్దుల్ కలాం నేతృత్వంలో తొలి లాంచ్ వెహికల్ ప్రయోగం జరిగింది. ఇప్పటివరకూ శ్రీహరికోట వేదికగా 100 ప్రయోగాలు జరిగాయి. 100 ప్రయోగాల్లో 548 శాటిలైట్లను నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా పంపాం. 3 చంద్రయాన్, మాస్ ఆర్బిటర్, ఆదిత్య, ఎస్ఆర్ఈ మిషన్లు చేపట్టాం.’ అని నారాయణన్ వివరించారు.
- Advertisement -