Sunday, September 8, 2024

హూజూరాబాద్  ఎవరికి హూజూర్

- Advertisement -
Huzurabad is Huzur for whom
Huzurabad is Huzur for whom

కరీంనగర్, నవంబర్ 18, (వాయిస్ టుడే):  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ పట్టణానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి పురిటి గడ్డగా ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన పేరు ఉంది. రాజకీయ చైతన్యం అధికంగా ఉండే ఈ ప్రాంతం.. తెలంగాణ వాదాన్ని అనేకసార్లు నిరూపించింది. అంతేకాదు ఈ ప్రాంత నాయకుడికి అన్యాయం జరిగితే ధైర్యంగా నిలబడ్డది. సానుభూతిని చూపి ఏకంగా ప్రజాక్షేత్రంలో తిరుగులేని నాయకుడిని చేసింది. అలాంటి ఈ నియోజకవర్గంలో ఒక నాయకుడు ఎనిమిదవ విజయంపై కన్నేశారు. ఈసారి ఎలాగైనా ఓడించాలని మరొక నాయకుడు పట్టుదలతో ఉన్నారు. రెండో మాటకు తావు లేకుండా హుజురాబాద్ నియోజకవర్గం ఈటెల రాజేందర్ కు పెట్టని కోట. గత ఏడు పర్యాయాలు ఆయన ఇక్కడ వరుస విజయాలు సాధించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన రాజీనామా చేసిన ప్రతిసారి ఇక్కడి ఓటర్లు గుండెల్లో పెట్టుకున్నారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం మలిదశ ప్రభుత్వంలో ఈటల రాజేందర్ ను కెసిఆర్ భర్త రఫ్ చేయడంతో ఒక్కసారిగా హుజురాబాద్ వార్తల్లో కి ఎక్కింది. అయితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచిన ఈటల రాజేందర్ తన సమీప ప్రత్యర్థి పాడి కౌశిక్ రెడ్డి మీద విజయం సాధించారు. 2018 ఎన్నికల్లోనూ వీరిద్దరూ పరస్పరం తలపడ్డారు. ఆ ఎన్నికల్లోను రాజేందర్ గెలిచారు. అయితే ఈసారి ఈటెల రాజేందర్ హుజరాబాద్ మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీగా గజ్వేల్ లో కూడా బరిలో ఉన్నారు.ఈటల రాజేందర్ వరుసగా ఎనిమిదో సారి ఎమ్మెల్యేగా గెలుపొందాలని పట్టుదలతో ఉన్నారు. రాజేందర్ ప్రత్యర్థి పాడి కౌశిక్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఈటెల రాజేందర్ భారత రాష్ట్ర సమితికి రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీలోకి కౌశిక్ రెడ్డి వెళ్లారు. అనంతరం కెసిఆర్ కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ స్థానం కట్టబెట్టారు. ప్రభుత్వ విప్ గా నియమించారు.

ఇక అప్పటినుంచి అటు ఈటల ఇటు కౌశిక్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇక ఈ నియోజకవర్గంలో గత 45 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యక్తికి టికెట్ ఇస్తుండడంతో ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోతూ వస్తున్నారు. ఇక తాజాగా ఈ ఎన్నికల్లో రాజ్యసభ మాజీ సభ్యుడు ఒడితల రాజేశ్వరరావు మనవడు ఒడితల ప్రణవ్ ను బరిలోకి దించారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 22 మంది అభ్యర్థులు హుజరాబాద్ లో పోటీలో ఉన్నారు.ప్రభుత్వ పథకాలపై బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమాగా ఉన్నారు. తాను చేసిన అభివృద్ధి పట్ల ఆయన నమ్మకంగా ఉన్నారు. 20 సంవత్సరాలుగా ఆయన ఈ ప్రాంత ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వేలాదికోట్లతో తాను చేసిన అభివృద్ధి పనులు గెలిపిస్తాయని ఈటెల రాజేందర్ నమ్ముతున్నారు.. తాను నిర్మించిన ఆసుపత్రులు, రహదారులు, రైల్వే వంతెనలు, వాగులపై నిర్మించిన చెక్ డ్యాములు, కమ్యూనిటీ భవనాలు, సబ్ స్టేషన్లు, అంతర్గత రోడ్లు, గ్రామపంచాయతీ నూతన భవనాలు.. హుజరాబాద్ నియోజకవర్గానికి కొత్త రూపు తీసుకొచ్చాయని ఆయన నమ్ముతున్నారు.ఇక భారత రాష్ట్ర సమితి అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై నమ్మకం పెట్టుకున్నారు. చేసిన అభివృద్ధి తనను గట్టెక్కిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఆయన ఈ నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. తనకున్న పరిచయాలతో హుజరాబాద్ లో ప్రభుత్వ నిధుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అవే తనను గెలిపిస్తాయని ఆయన నమ్ముతున్నారు.కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి వీస్తున్న సానుకూల పవనాలనే నమ్ముకున్నారు. తన తాత రాజేశ్వరరావు చేసిన సేవలు పట్ల నియోజకవర్గ ప్రజలు విశ్వాసం చూపిస్తారని ఆయన భావిస్తున్నారు. ఏడాదిన్నరగా నియోజకవర్గంలో తాను చేస్తున్న సామాజిక సేవలు గెలిపిస్తాయని ఆయన నమ్మకంగా ఉన్నారు. దీనికి తోడు గత 45 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవలేదని.. ఈసారి సానుభూతి మంత్రం పనిచేస్తుందని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. ఇలా త్రిముఖ పోటీ నెలకొన్న ఈ హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలు ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది డిసెంబర్ 3న తేలనుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్