ముగ్గురు పుడితే 30 వేలు.. నలుగురు పుడితే 40 వేలు
If three children are born, 30,000; if four are born, 40,000.
శ్రీకాకుళం, మే 16
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారుతున్న జనాభా సమీకరణాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక గళం విప్పారు. గత కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్న జనాభా నియంత్రణ విధానాలకు స్వస్తి పలికి, ఇప్పుడు జనాభా నిర్వహణ అనే కొత్త మంత్రాన్ని ఆయన తెరపైకి తెచ్చారు. పిల్లలు భారం కాదు.. వారు రాష్ట్రానికి అసలైన సంపద అని స్పష్టం చేస్తూ, ఎక్కువ మంది పిల్లలను కనే కుటుంబాలకు ప్రభుత్వం నుంచి నేరుగా ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో రాష్ట్రం వృద్ధుల ఆంధ్రప్రదేశ్ గా మారకుండా ఉండాలంటే యువశక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.నరసన్నపేట సభ వేదికగా చంద్రబాబు సరికొత్త ప్రోత్సాహకాలను వివరించారు. కుటుంబంలో మూడో బిడ్డ జన్మిస్తే రూ. 30,000 , నాలుగో బిడ్డ జన్మిస్తే రూ. 40,000 చొప్పున ప్రభుత్వం తరఫున నగదు ప్రోత్సాహకం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మొత్తాన్ని ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా తల్లి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. కేవలం నగదు సాయమే కాకుండా, ఆ బిడ్డల సంరక్షణ, పౌష్టికాహారం , విద్య కోసం ప్రత్యేక ప్యాకేజీని రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రస్తుతం అమలులో ఉన్న తల్లికి వందనం పథకం గురించి కూడా ముఖ్యమంత్రి సానుకూల వ్యాఖ్యలు చేశారు. పిల్లల చదువుల కోసం ఇచ్చే రూ. 15,000 ఆర్థిక సహాయాన్ని భవిష్యత్తులో మరింత పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. భగవంతుడు కరుణించి, రాష్ట్ర ఆర్థిక వనరులు మెరుగైతే ఈ సహాయాన్ని ఇంకా పెంచుతాము అని చంద్రబాబు భరోసా ఇచ్చారు. చిన్న కుటుంబాల ధోరణి వల్ల భవిష్యత్తులో పని చేసే వారు తగ్గిపోయి, కేవలం వృద్ధులే మిగిలే ప్రమాదం ఉందని, దానిని అరికట్టేందుకు తల్లులు ముందుకు రావాలని ఆయన కోరారు.దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జననాల రేటు గణనీయంగా పడిపోతుండటం వల్ల కలిగే నష్టాలను చంద్రబాబు శాస్త్రీయంగా వివరించారు. యువత సంఖ్య తగ్గితే అభివృద్ధి కుంటుపడుతుందని, ఉత్పాదకత దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తానే జనాభా నియంత్రణకు పిలుపునిచ్చానని, అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు జనాభాను పెంచుకోవాల్సిన అనివార్యత ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. మళ్లీ ఇళ్లలో పిల్లల కిలకిలరావాలు వినిపించినప్పుడే రాష్ట్ర ప్రగతి సాధ్యమని పేర్కొన్నారు. కేవలం ఆర్థిక సహాయమే కాకుండా, జనాభా ప్రాముఖ్యతపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సీఎం పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలను జనాభా పెంపునకు అనుసంధానించడం ద్వారా భవిష్యత్తు తరాలకు అవసరమైన మానవ వనరులను ఇప్పుడే సిద్ధం చేసుకోవాలని ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. శ్రీకాకుళం పర్యటనలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.



