మహబూబ్ నగర్, అక్టోబరు 19, (వాయిస్ టుడే): నారాయణ్‌ఖేడ్‌లో పట్లోళ్ల సంజీవ రెడ్డి, సురేష్ షెట్కార్ మధ్య వర్గ పోరు కాంగ్రెస్ పార్టీకి చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇద్దరు నేతలు వర్గపోరుకు ముగింపు పలక్కపోవడంతో పార్టీలో గందరగోళానికి కారణం అవుతోంది.నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులూ పట్లోళ్ల సంజీవ రెడ్డి, సురేష్ షెట్కర్ తమ మధ్య వర్గ పోరుకి ముగింపు పలకటం లేదా?అంటే అవుననే అంటున్నాయి నార్యాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు. వీరిద్దరూ కలసిపోయి ఉంటె నారాయణఖేడ్ అభ్యర్థి పేరు కాంగ్రెస్ మొదటి జాబితాలోనే ఉండేదని చెబుతున్నారు.ఇద్దరు నాయకుల తమ మధ్య వైరం వీడకపోతే, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల రెండవ జాబితాలో కూడా వీరికి లో ఎవరికీ కూడా టికెట్ ఉండకపోవచ్చేమో అని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.ఉమ్మడి జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే గుర్తొచ్చేది నారాయణఖేడ్ నియోజకవర్గంమే.

2014 ఎన్నికల వరకు నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌కి కంచుకోటగా ఉంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్ట రెడ్డి కుమారుడైన పట్లోళ్ల సంజీవ రెడ్డి, మాజీ జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ మధ్య సఖ్యత లేకపోవడం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర చిక్కులు తెచ్చిపెడుతోందిబీఆర్ఎస్ పార్టీ ని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ నేతలంతా కలిసి పనిచేయాలని క్యాడర్ భావిస్తుంటే,ఈ ఇద్దరు ప్రధాన నాయకుల మధ్యన వైరం పార్టీ నాయకత్వానికి అభ్యర్థి ఎవరనేది తేల్చటానికి కూడా అవకాశం ఇవ్వటం లేదు. వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి, పార్టీ నాయకులూ ఇప్పటికే పలు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు.బిఆర్ఎస్ పార్టీ, ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ని వరుసగా నాలుగోసారి తమ అభ్యర్థిగా ప్రకటించడంతో, తాను ప్రచారంలో దూసుకుపోతున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరో తేలకపోవడం తో ఆ పార్టీలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా మారింది.2014 లో సంజీవ రెడ్డి తండ్రి కిష్ట రెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేసి నారాయణఖేడ్ నుండి గెలిశాడు, కానీ తాను అనారోగ్యంతో 2016 లో మృతిచెందడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ సారి పార్టీ నాయకత్వం సంజీవ రెడ్డికి అవకాశం కల్పించింది. కానీ తాను ఎన్నికల్లో, బిఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు.2018 ఎన్నికల్లో పార్టీ సురేష్ షెట్కార్ కి అవకాశం ఇవ్వడంతో అలిగిన సంజీవ రెడ్డి భారతీయ జనతా పార్టీ లో చేరి పోటీ చేసాడు. ఇద్దరు విడిపోవడంతో, భూపాల్ రెడ్డికి మరోసారి విజయం నల్లేరు మీద నడకే అయ్యింది. ఎన్నికల తర్వాత, సంజీవ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు.ఈ సారైనా సంజీవ రెడ్డి, సురేష్ షెట్కార్ కలిసిపోతారా, కాంగ్రెస్ పార్టీని తిరిగి నారాయణఖేడ్ లో గెలిపించుకుంటారా అనే ప్రశ్న కాంగ్రెస్ క్యాడర్ మదిని తొలుస్తుంది. నామినేషన్ల వరకైనా, ఈ ప్రశ్నకు ఒక సమాధానం లభిస్తుంది అని నారాయణఖేడ్ వాసులు ఆశిస్తున్నారు.