1.4 C
New York
Monday, February 26, 2024

కేసుల చక్రబంధనంలో

- Advertisement -

కేసుల చక్రబంధనంలో
గులాబీ నేతలు.. అధికారులు
హైదరాబాద్, ఫిబ్రవరి 2
తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పదవి  చేపట్టినప్పటి నుంచి సంయమనంతో వ్యవహరిస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గతంలో ఆయనకు ఎదురైన అనుభవాలతో పదవి దక్కగానే ఆవేశ పడతారని..బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడతారని అనుకున్నారు. కానీ రేవంత్  రెడ్డి పాలనపై మాత్రమే దృష్టి పెట్టారు. కానీ అనివార్యంగా కొన్ని విచారణలు చేపట్టాల్సి వచ్చింది. మేడిగడ్డ కుంగిపోవడంతో దానిపై విచారణను విజిలెన్స్ కు అప్పగించారు. ప్రాథమిక నివేదిక సిద్ధం అయిందని.. అందులో చాలా సంచలన విషయాలున్నాయని మీడియాకు లీక్ అయింది.  ఆ తర్వాత హెచ్‌ఎండీఏలో చాలా కాలం చక్రం తిప్పిన శివబాలకృష్ణపై ఏసీబీ దాడుల్లో సంచలనాలు బయటపడ్డారు. అదే సమయంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితునిగా ముద్ర పడిన  సోమేష్ కుమార్ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లుగా బయటకు వచ్చింది. వీటిపై ప్రభుత్వం దూకుడుగా వ్యవహిరంచడం లేదు. నింపాదిగానే వ్యవహరిస్తోంది.
రాజకీయాల్లో కక్ష సాధింపులు అనేవి ఎప్పుడూ ఎదుర్కొనే వారికే మేలు చేస్తాయి. ఇదే చరిత్ర చెబుతోంది.  జైలుకు వెళ్లిన  నేతలు ముఖ్యమంత్రులు అయ్యారు.  రేవంత్ రెడ్డి తెలంగాణలో కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా నిలబడ్డారంటే.. ఆయనను కేసీఆర్ అంతగా టార్గెట్ చేయబట్టే. తాను కేసీఆర్ ను ప్రత్యర్థిగా ఎంచుకోలేదని.. తననే కేసీఆర్ ప్రత్యర్థిగా ఎంచుకున్నారని రేవంత్ రెడ్డి చెబుతూంటారు.  రేవంత్ ను ఏదో చేయాలని టార్గెట్ చేయడంతో  అదే ఆయనకు మేలు చేసింది. ఈ సూక్ష్మసిద్ధాంతం బాగాతెలుసు కాబట్టే రేవంత్ రెడ్డి పదవి చేపట్టగానే ఆవేశపడలేదు. అలా అని వదిలేయలేదని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ప్రతి కేసూ బీఆర్ఎస్ దగ్గరకు వెళ్తుందన్న  వాదన వినిపిస్తోంది.
భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న పదేళ్లలో హైదరాబాద్ చుట్టుపక్కల  జరిగిన భూ దందాలపై లెక్కలేన్ని ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా రేవంత్ రెడ్డి ఎన్నో ఆరోపణలు చేశారు. కోర్టుల్లో కేసులు వేశారు. ఇప్పుడు రేవంత్ సీఎం అయ్యారు.   ఆరోపణలు ఇప్పుడు చేయడం లేదు. మెల్లగా ఎక్కడ నొక్కితే భూదందాలన్నీ బయటకు వస్తాయో అక్కడ నొక్కుతోంది ప్రభుత్వం.  హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ  అరెస్ట్ తర్వాత వ్యవహారంలో భూదందాలు అన్నీ ఎవరి కేంద్రంగా నడిచాయో వారి దగ్గరకు కేసులు చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.   అందుకే ఇదంతా వ్యూహాత్మకంగా రేవంత్ అమలు చేస్తున్న వ్యూహంగా భావిస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల  ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ వేల ఎకరాల్లో అవకతవకలు జరిగాయని చాలా కాలంగా తెలంగాణ  ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.  సరైన సౌకర్యాలు లేకపోయిన  హైరైజ్ అపార్టుమెంట్లకు  అనుమతులు ఇవ్వడం దగ్గర్నుంచి ఎన్నో అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి.  ప్రభుత్వం మారగానే అన్నింటి లెక్క సరి చేస్తారని అనుకున్నారు . చేస్తున్నారు కూడా. కానీ ఎవరూ ఊహించని రీతిలో. కక్ష సాధింపు అనే  ఆరోపణలు రాకుండా కింది స్థాయి నుంచి ఏం జరిగిందో బయటకు తీసుకంటూ వస్తున్నారు.  అందులో భాగంగానే  హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను మొదట పట్టేశారు. రియల్ ఎస్టేట్  వ్యాపార సామ్రాజ్యంలో శివబాలకృష్ణ గురించి తెలియని వారు ఉండరు. ఆయన లీలలు అన్నీ ఇన్ని కావు. ఆయన అరెస్టుతో ఒక్కొక్కటి బయటకు వస్తోంది.  ధరణిని అడ్డం పెట్టుకుని చేసిన దందాలో   భూముల్ని ఇష్టం వచ్చినట్లుగా సొంతానికి రాసుకోవడం..  రాజకీయ నేతలకు కావాల్సినట్లుగా చేయడం వంటివి చేశారన్న ఆరోపణలు కాంగ్రెస్ నేతలు చేశారు.   కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడిన, ధరణి విషయంలో అన్నీ తానై వ్యవహరించిన సోమేష్ కుమార్   వ్యవహారం వెలుగులోకి వస్తోంది.  రెరా సెక్రెటరీగా బాలకృష్ణ ఉన్న సమయంలో ఛైర్మన్‌గా సోమేష్ కుమార్ ఉన్నారు. ఆ సమయంలోనే యాచారంలో 25 ఎకరాలు సోమేష్ భార్య గ్యాన్ ముద్ర పేరుతో రిజిస్టర్ అయినట్లు అధికారులు గుర్తించారు. యాచారంలోని సర్వే 249, 260లోని వ్యవసాయ భూమి సోమేష్ కుమార్ భార్య పేరుపై రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ల్యాండ్‌పై ఏసీబీ వివరాలు సేకరించే పనిలో పడింది. బాలకృష్ణతో లాభాలు పొందిన అధికారుల చిట్టాను ఏసీబీ బయటకు తీస్తోంది. సోమేష్ కుమార్‌కు 25 ఏకరాల భూమి ఎలా వచ్చిందన్న దానిపై ఏసీబీ దర్యాప్తు చేపట్టింది.  యాచారం మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో ఈ భూమి ఉంది. ఇక్కడ ఎకర భూమి విలువ రూ.3 కోట్లుగా ఉంది. అంటే ఆ భూమి విలువ రూ.75 కోట్లు. అయితే ఈ భూమి సోమేష్ కుమార్‌కు ఎలా వచ్చిందో తెలియడం లేదు. ఖాతా నంబర్ 5237 అనే నంబర్ ఎలా వచ్చిందో ఎవరికి అర్థం కావడం లేదు. పైగా ఈ భూములను సేల్ డీడ్ ద్వారా కొనలేదు. సాదాబైనామా ద్వారా భూమి కొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్ సైట్ లో ఎన్ కంబరెన్స్ సర్టిఫికేట్ కోసం చేస్తే కనిపించడం లేదు.  కానీ సరైన పద్ధతిలోనే భూమిని కొనుగోలు చేసినట్లు సోమేష్ కుమార్ చెబతున్నారు. తనకున్న ఇళ్లు అమ్మి స్థలం కొనుగోలు చేసినట్లు పేర్కొంటున్నారు. ఎకరం రెండు లక్షలకే కొనుగోలు చేసినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. ఈ ఆర్థిక లావాదేవీల గురించి మొత్తం బయటకు లాగే అవకాశం కనిపిస్తోంది.   నిజానికి శివబాలకృష్ణ చిన్న చేపేనని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  గతంలో జరిగిన భూ లావాదేవీలు.. ఇతర అంశాలపై సమగ్ర సమాచారం ఉన్న కాంగ్రెస్ పెద్దలు కింది స్థాయి నుంచి నరుక్కుంటూ వస్తున్నారని అంటున్నారు.  నేరుగా కేసీఆర్ లేదా కేటీఆర్ ను టార్గెట్ చేస్తే కక్ష సాధింపు అనే ప్రచారం జరుగుతుంది.  రాజకీయాల్లో ఇలాంటి కక్ష సాధింపులు ..  వారికి ఉపయోగపడతాయి.   సానుభూతి కోసం ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి సానుభూతి అస్త్రాన్ని ఇవ్వడానికి సిద్ధం గా లేదని చెబుతున్నారు. మొత్తం ఏసీబీ ద్వారా స్కాం మూలాల నుంచి తవ్వుకుంటూ వస్తున్నారని దర్యాప్తులో అది కేసీఆర్, కేటీఆర్ వద్దకు చేరుతుందని.. దాని వల్ల ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపులు పాల్పడటం లేదని ప్రజలకు అంచనాకు వస్తారని నమ్ముతున్నారు.  భూముల విషయంలో కేసీఆర్,  కేటీఆర్ కు తెలియకుండా హెచ్‌ఎండీలో ఎలాంటి అనుమతుల రావడం.. ఫైల్స్ కదలడం వంటివి జరిగేవి కాదు.  లోక్‌సభ ఎన్నికలు జరిగే వరకూ.. గుట్టు అంతా బయటకు లాగే ప్రయత్నం  చేస్తారని.. ఎన్నికలు ముగిసిన తర్వాత అసలు రాజకీయం ప్రారంభిస్తారని అంటున్నారు. మొత్తంగా కేసులు.. వ్యవహారాలు రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారే అవకాశం ఉంది. 

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!