*ఎంసెట్ కోచింగ్ పేరిట
సెకండ్ ఇయర్ క్లాసులు చెప్తున్నారు*
సమాచార హక్కు చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సూర స్రవంతి
హనుమకొండ:- ఇంటర్మీడియట్ కార్పొరేట్ కాలేజీలు రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని సమాచార హక్కు చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సూర స్రవంతి చెప్పారు.
వేసవి సెలవుల్లో ఎంసెట్ కోచింగ్ పేరుతో సెకండ్ ఇయర్ క్లాసులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం హనుమకొండ లోని తన ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. హనుమకొండలో స్టూడెంట్లకు వేసవి సెలవులు ఇవ్వకుండా క్లాసులు నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ రాకముందే జరుపుతున్న అడ్మిషన్లను రద్దు చేయాలని కోరారు. ఈ ఏడాది నుంచి ఇంటర్ అడ్మిషన్లను ఆన్లైన్ ద్వారా చేపట్టాలని, తెలంగాణలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలుచేసి, కార్పొరేట్ కాలేజీల ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఒక కాలేజీకి పర్మిషన్ తీసుకుని, అనేక బ్రాంచులు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.