Sunday, September 8, 2024

ఆసక్తికరంగా మునుగోడు రాజకీయం

- Advertisement -

నల్గోండ, నవంబర్ 3, (వాయిస్ టుడే): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి మునుగోడు రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. రోజు రోజుకు వేగంగా మారుతున్న సమీకరణాలతో ఇక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీల నేతలు కండువాలు మారుస్తుండడంతో మునుగోడు రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు నియోజకవర్గం మరోసారి హాట్ టాపిక్ గానే మారింది.గత ఏడాది జరిగిన ఉప ఎన్నికతో మునుగోడు నియోజకవర్గం జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించింది. 2018 ఎన్నికల్లో మునుగోడు కాంగ్రెస్ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 16నెలల క్రితం కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. దీంతో అనివార్యంగా వచ్చిన ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. బీజేపీ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేసి 23 వేల ఓట్లు మాత్రమే దక్కించుకున్నారు.మరీ ఈసారి ఎన్నికల్లో బీ‌ఆర్‌ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో ఉంటున్నారు. ఉప ఎన్నిక తర్వాత పార్టీకి అంటిముట్టన్నట్లుగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉంటారని అందరూ భావించారు. సరిగ్గా మునుగోడులో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ముందు రోజు అక్టోబర్ 26వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎదుగుతుండడంతో సొంతగూటికి వచ్చినట్లు రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టికెట్ సంపాదించి మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగారు.ఉప ఎన్నిక సమయంలో అనూహ్యంగా మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ నేతగా.. రేవంత్ రెడ్డి అనుచరుడుగా చలమల్ల కృష్ణారెడ్డి తెరపైకి వచ్చారు. ఉప ఎన్నిక సందర్భంగానే చలమల్ల కాంగ్రెస్ టికెట్ ఆశించారు. అయితే పార్టీ సీనియర్లు పాల్వాయి స్రవంతిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని రేవంత్ రెడ్డి.. చలమల్ల కృష్ణారెడ్డికి హామీ ఇచ్చారట. ఉప ఎన్నిక నాటి నుంచే నియోజకవర్గంలో విస్తృతస్థాయిలో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ జోష్ పెంచారు చలమల్ల. పార్టీ టికెట్ కోసం పాల్వాయి స్రవంతితో పాటు చలమల్ల కృష్ణారెడ్డి కూడా దరఖాస్తు చేసుకున్నాడు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా చలమల్ల కృష్ణారెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.కానీ అనూహ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరి మునుగోడు నుంచి కాంగ్రెస్ టికెట్ సంపాదించారు. దీంతో చలమల్ల కృష్ణారెడ్డి అనుచరులతో సమావేశమై అవసరమైతే రెబల్ గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. బోసు రాజు లాంటి కాంగ్రెస్ పెద్దలు కూడా కృష్ణారెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. తనకు కాంగ్రెస్ టికెట్ దక్కకుండా ఎత్తుకెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చలమల్ల కృష్ణారెడ్డి రగిలిపోయాడు. చలమల్ల కృష్ణారెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకున్నారు. మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు కృష్ణారెడ్డి ప్రయత్నిస్తున్నారు. అయితే అనుహ్యంగా బీజేపీ విడుదల చేసిన మూడో జాబితాలో చలమల్ల కృష్ణారెడ్డికి చోటు దక్కలేదు. రేపో మాపో మునుగోడులో పార్టీ అభ్యర్థిగా కృష్ణారెడ్డిని బీజేపీ ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్నాయి.అయితే ఇప్పటి వరకు మునుగోడు నుంచి బీజేపీ టికెట్ అశిస్తున్న గంగిడి మనోహర్ రెడ్డికి మరోసారి భంగపాటు తప్పదనిపిస్తుంది. ఇప్పటి వరకు టికెట్ దక్కుతుందని పెట్టుకున్న ఆశలను చలమల్ల కృష్ణారెడ్డి రూపంలో నీళ్లు చల్లినట్టు అయ్యింది. దీంతో మనోహర్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం.

రాత్రికి రాత్రే నేతలు కండువాలు మారుతుండటంతో పార్టీ శ్రేణుల్లోనూ ఆందోళన మొదలైంది. దీంతో ఒక్కసారిగా మునుగోడు రాజకీయాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి.మునుగోడు ఉప ఎన్నిక తర్వాత బీఆర్ఎస్‌తో స్నేహం బెడిసి కొట్టడంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జత కట్టాలని వామపక్షాలు భావించాయి. ఇక్కడి నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన సిపిఐ మునుగోడు స్థానాన్ని అడిగింది. కానీ మొన్నటి వరకు నాన్చివేత ధోరణితో వ్యవహరించిన కాంగ్రెస్, రెండో జాబితాలో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ప్రకటించింది. దీంతో ఖంగుతిన్న సిపిఐ.. మునుగోడులో ఫ్రెండ్లీ కాంటెస్ట్‌కు సిద్ధమైనట్లు సమాచారం.మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల బరిలో దూసుకుపోతున్నారు. పార్టీలో వర్గపోరు ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీల కంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రచారంలో ముందున్నారు. మొత్తం మీద ఎన్నికల బరిలో నిలవబోయే అభ్యర్థులు పార్టీ కండువాలు మార్చుతుండటంతో మునుగోడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్