హైదరాబాద్, నవంబర్ 22, (వాయిస్ టుడే): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి సరిగ్గా వారం రోజుల వ్యవధి ఉంది. ఈ నెల 30న పోలింగ్ జరుగుతుంది. వచ్చే నెల 3న ఫలితాలు వెలువడుతాయి. అంటే మరో పన్నెండు రోజులలో రాష్ట్రంలో కొలువుదీరనున్న తదుపరి సర్కార్ ఎవరిదన్నది తేలిపోతుంది. రాష్ట్రంలో ఎన్నికల బరిలో ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఎంత మంది అభ్యర్దులు రంగంలో ఉన్నారు. వారిలో రెబల్స్ ఎందరు? ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఏయే పార్టీల మధ్య జరుగుతోంది అన్నవన్నీ పక్కన పెడితే.. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే మాత్రం తెలంగాణలో జరుగుతన్నది, జరగనున్నది ముఖాముఖీ పోరేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారుతెలంగాణ ఎన్నికల సమరంలో బీఎస్పీ మినహా మిగిలిన చిన్నా చితకా పార్టీలన్నీ పోటీ నుంచి తప్పుకోవడమో, ప్రధాన పార్టీలకు అనుకూలంగా మారిపోవడమో జరిగిపోయింది. ఇక రాష్ట్రంలో అధికారమే తరువాయి అన్నంతగా బిల్డప్ ఇచ్చిన బీజేపీ ఇంకా ఎన్నికలకు పూర్తిగా సన్నద్ధం కాని పరిస్థితే రాష్ట్రంలో కనిపిస్తోంది. ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి మహామహా సీనియర్లుగా చెప్పుకునే వారే వెనుకంజ వేశారు. కిషన్ రెడ్డి పోటీకి దూరంగా ఉండటమే ఇందుకు ఉదాహరణగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు, ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులలో కనిపిస్తున్న నిరాశక్తత గమనిస్తే.. తెలంగాణలో ప్రధాన పోటీ అధికార బీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ మధ్యేననీ, ఒక రకంగా ఈ రెండు పార్టీల మధ్యా ముఖాముఖి పోరుగా ఈ ఎన్నికలు మారిపోయాయని విశ్లేషిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రెండు పార్టీలూ చేస్తున్న వాగ్దానాలు, ఇస్తున్న హామీలు.. పరిధి మీరినట్లుగా కనిపిస్తున్న విమర్శల బాణాలు ఆ సంగతినే తేటతెల్లం చేస్తున్నాయి. కొద్ది సేపు వాటిని పక్కన పెడితే ఈ సారి ఎన్నికలలో సెంటిమెంట్ కు స్థానం లేకుండా పోయింది. అభివృద్ధి, సంక్షేమం ప్రధాన అజెండాగా మారిపోయాయి.రాష్ట్ర ఆవిర్భావం తువాత జరిగిన రెండు ఎన్నికలలోనూ కూడా అభివృద్ధి, సంక్షేమం పెద్దగా ప్రాధాన్యత లేని అంశాలుగానే ఉండిపోయాయి. తెలంగాణ సెంటిమెంట్ మాత్రమే ఆ రెండు ఎన్నికల ప్రాచరంలోనూ కీలక భూమిక పోషించింది. ఆ రెండు ఎన్నికలలోనూ తెలంగాణ సెంటిమెంట్ ను పండించడంలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) విజయం సాధించింది. సెంటిమెంట్ అంతటి ప్రధాన పాత్ర పోషించినా కూడా ఆ రెండు ఎన్నికలలోనూ బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) అత్తెసరు మార్కులతోనే గట్టెక్కి అధికార అందలాన్ని అందుకుంది. ఆ తరువాత ఆపరేషన్ ఆకర్ష్ అంటూ వలసలను, జంప్ జిలానీలను ప్రోత్సహించడం ద్వారా తిరుగులేని బలాన్ని సంపాదించుకుంది అది వేరే సంగతి. అయితే ఈ సారి ఎన్నికలలో తెలంగాణ సెంటిమెంట్ అనేది ఇక ఎంత మాత్రం విజయాన్ని అందించే అస్త్రం కాదు. ఆ పరిస్థితిని టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చేసి జాతీయ రాజకీయాలపై దృష్టి సారించడం ద్వారా4 స్వయంగా కేసీఆర్ తీసుకువచ్చారు. అయితే ఆయన జాతీయ రాజకీయ ప్రవేశానికి దారులన్నీ మూసుకుపోయిన పరిస్థితుల్లో గత్యంతరం లేక తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ తెర మీదకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. చేస్తున్నారు. కానీ అది పెద్దగా ఫలిస్తున్నట్లు కనిపించడం లేదు. ఆయన పరాయి పాలన, పరాయి రాష్ట్రం అంటూ సభల్లో చెబుతుంటే.. పార్టీ శ్రేణులే మరి బీఆర్ఎస్ గా పార్టీని మార్చి ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు పరాయి రాష్ట్రం మాట గుర్తు రాలేదా అని చర్చించుకుంటున్నాయంటే.. ప్రస్తుత ఎన్నికలలో తెలంగాణ వాదం ఎంత అప్రధానంగా మారిపోయిందో అవగతమౌతోంది. కాంగ్రెస్ ప్రచారంలో ఒక అడుగు ముందుందని చెప్పాల్సి ఉంటుంది. తెలంగాణ తెచ్చిన పార్టీగా రెండు సార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ, తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఒకసారి అధికారం ఇచ్చి చూడండంటూ ప్రజలను కోరుతోంది. అంతర్గత కుమ్ములాటలను అధిగమించి ప్రజారంలో దూసుకువెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి బాగోతా లను జనాలకు వివరిస్తూ, ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తోంది. మహిళలకు ప్రతి నెలా నగదు బదిలీ, విద్యార్థులకు నగదు ఆసరా, రైతులకు ఆర్థిక సహాయం వంటి ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. ఏ విధంగా చూసినా చేసింది చెప్పుకోవడంలో అధికార బీఆర్ఎస్ తడబడుతుంటే.. విపక్ష కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ ముందుకు సాగుతోంది. అన్నిటికీ మించి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో బీఆర్ఎస్ స్పందన ఆ పార్టీకి ఒక విధంగా తీరని నష్టం చేసిందనే చెప్పాలి. ఆ తరువాత నాలిక కరుచుకుని నష్టనివారణ చర్యలు చేపట్టినా అప్పటికే ఆలస్యమైపోయింది. కేసీఆర్ ఎన్టీఆర్ భజన చేస్తున్నా.. కేటీఆర్ చంద్రబాబు అరెస్టు దారుణమంటూ చెబుతున్నా జనం నమ్మడం లేదు. అదే సమయంలో చంద్రబాబు అరెస్టును వెంటనే ఖండించడం ద్వారా కాంగ్రెస్ తెలుగుదేశం శ్రేణులనే కాకుండా, సెటిలర్లను కూడా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలలో ముఖాముఖి పోరు హోరాహోరీగా ఆసక్తికరంగా మారాయని పరిశీలకులు అంటున్నారు.