- Advertisement -
సినిమాలు అలా తీయడం సాధ్యమేనా
Is it possible to make movies like that?
హైదరాబాద్, డిసెంబర్ 28, (వాయిస్ టుడే)
సీఎం రేవంత్ రెడ్డితో చిత్ర ప్రముఖుల భేటీ విఫలం అనే చెప్పాలి. వారు కోరుకున్నది జరక్కపోగా కొత్త ఆంక్షలు మోపి పంపారు . అయితే రేవంత్ రెడ్డి చెప్పినట్లు సినిమాలు తీయడం సాధ్యమేనా అనే ప్రశ్న మొదలైంది.సంధ్య థియేటర్ ప్రమాదంలో మహిళ మృతి చెందిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు. టికెట్స్ పెంపుకు కూడా అనుమతులు ఇవ్వమని తేల్చి చెప్పాడు. మరో రెండు వారాల్లో సంక్రాంతి సినిమాల విడుదల ఉంది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ చిత్రాలపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపనుంది.అలాగే భవిష్యత్తులో టాలీవుడ్ లో తెరకెక్కే భారీ బడ్జెట్ చిత్రాలు నష్టపోతాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తన నిర్ణయంపై పునరాలోచన చేయాలి. ఆయన్ని బెనిఫిట్ షోలు, టికెట్స్ హైక్ కి ఒప్పించాలని భేటీ అయ్యారు. ఎఫ్ డీ సీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో దర్శక నిర్మాతలు, హీరోలు రేవంత్ రెడ్డిని కలిశారు. ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు.రేవంత్ రెడ్డి చిత్ర ప్రముఖుల ఆశలపై నీళ్లు చల్లారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన ప్రతిపాదనలు, విధించిన ఆంక్షలు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. శాంతి భద్రతల విషయంలో రాజీ పడేదిలేదన్న రేవంత్ రెడ్డి… అసెంబ్లీలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని నిర్మొహమాటంగా చెప్పారు. టికెట్స్ హైక్ తో పాటు బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వడం కుదరదు అన్నారు. ప్రయోజనం కోరి వెళ్లిన చిత్ర ప్రముఖులకు ఆయన పెట్టిన ఆంక్షలు మరింత ఆందోళనకు గురి చేశాయి.హీరోలు తమ పాపులారిటీ వాడి తెలంగాణకు పెట్టుబడులు తేవాలి. టూరిజం డెవలప్ చేయాలి. ప్రతి సినిమా హీరో తమ మూవీ విడుదలకు ముందు డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా క్యాంపైన్ చేయాలని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా భావించి, ఆ దిశగా అడుగులు వేయాలని అన్నారు. స్టార్ హీరోల బౌన్సర్స్ పబ్లిక్ కి హానీ కలిగించేలా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదు. ఇకపై వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. అలాగే అభిమానులను హీరోలు కంట్రోల్ లో పెట్టుకోవాలి. నేతలపై సోషల్ మీడియాలో దూషణలకు పాల్పడకుండా అదుపు చేయాలని సూచించారు.ఇవన్నీ పర్లేదు. కాగా సినిమాల్లో అసాంఘిక కార్యక్రమాలతో కూడిన సన్నివేశాలు. పాత్రలు ఉండకూడదని ఆయన హుకుం జారీ చేశాడట. డ్రగ్స్ వాడకంతో పాటు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లేకుండా చూసుకోవాలని చెప్పారట. స్టార్ హీరోల సినిమాలన్నీ వీటితోనే నిండి ఉంటాయి. త్వరలో రానున్న చిత్రాల్లో కొన్ని చిత్రాల్లో గ్యాంగ్ స్టర్ రోల్స్ చేస్తున్నారు. అది కూడా యాంటీ సోషల్ ఎలిమెంటే. ఫ్యాక్షన్ సబ్జెక్టులు, క్రైమ్ థ్రిల్లర్స్ కూడా ఈ కోవకే వస్తాయి. అసలు చెడు అనేది మచ్చుకైన లేకుండా సినిమాలు తీయడం సాధ్యమయ్యే పనేనా అనే వాదన తెరపైకి వచ్చింది.
- Advertisement -