ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు డ్యూటీ సర్టిఫికెట్ జారీ చేయండి.
Issue duty certificate to teachers who have performed election duties.
డిఆర్ఓకు యూటీఎఫ్ జిల్లా శాఖ వినతి.
బద్వేలు
2024 మే మాసంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా విధులు నిర్వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు తక్షణమే డ్యూటీ సర్టిఫికెట్ ఇప్పించుటకు చర్యలు తీసుకోవాలని డిఆర్ఓ ఎం.విశ్వేశ్వర నాయుడు ను యుటిఎఫ్ జిల్లా శాఖ కోరింది.
శనివారం సాయంత్రం కడపలోని కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ ఎం.విశ్వేశ్వర నాయుడును కలిసి ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు డ్యూటీ సర్టిఫికెట్ ఇప్పిచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయ కుమార్, పాలెం మహేష్ బాబు లు మాట్లాడుతూ 2024 మే మాసంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎన్నికల విధులు నిర్వహించారన్నారు. ఎన్నికలు మే మాసంలో జరిగినందున వేసవి సెలవులను నష్టపోయినందుకు గాను ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్జిత సెలవులను మంజూరు చేసిందని తెలిపారు. ఈ సెలవులను సర్వీసు రిజిస్టర్ నందు నమోదు చేయాలంటే ఎన్నికల విధులు నిర్వహించిన కాలానికి అధికారులు డ్యూటీ సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉందన్నారు. జిల్లావ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ అయిపోయిన వెంటనే ఉద్యోగులకు డ్యూటీ సర్టిఫికెట్ జారీ చేశారని, కమలాపురం నియోజకవర్గంతో పాటు మరి కొన్ని ప్రాంతాలలో డ్యూటీ సర్టిఫికెట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం తహసీల్దార్లను కలిసి ఈ విషయంపై ప్రాతినిధ్యం చేసినా వారు సరిగా స్పందించడం లేదని తెలిపారు. దీంతో ఉపాధ్యాయులు వేసవి సెలవులలో విధులు నిర్వహించిన కాలానికి ఆర్జిత సెలవులను సర్వీసు రిజిస్టర్ నందు నమోదు చేయించుకొనుటలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. దీంతోపాటు జిల్లా వ్యాప్తంగా రిజర్వులో విధులు నిర్వహించిన పలువురు ఉపాధ్యాయులకు అధికారులు డ్యూటీ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్ల ఆర్జిత సెలవులను పొందేందుకు వీలు లేకుండా ఉన్నదన్నారు. ఈ విషయంపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి, కమలాపురం అసెంబ్లీ పరిధిలో ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయులతో పాటు, జిల్లా వ్యాప్తంగా రిజర్వులో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు డ్యూటీ సర్టిఫికెట్ తక్షణమే ఇప్పించేందుకు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు డ్యూటీ సర్టిఫికెట్ ఇప్పించేందుకు తగు చర్యలు తీసుకుంటామని, ఆ మేరకు అధికారులకు ఆదేశాలు ఇస్తామని తెలియజేశారు.