హైదరాబాద్ నవంబర్ 21: ఎన్నికల వేళ రాష్ట్రంలో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు అభ్యర్థుల ఇండ్లు, కార్యాలయాలు, పరిశ్రమల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. తాజాగా చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివెక్ ఇండ్లు, ఆఫీసులపై దాడులు చేశారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ, బంజారాహిల్స్, మంచిర్యాలలో సోదాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా సోదాలు చేస్తున్నారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లోని పలువురు వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్ల ఇండ్లలో తనిఖీలు చేస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త రఫిక్ జీవానీ ఇంటిపై కూడా దాడి చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీర శ్యాం నాయక్ ఫిర్యాదు మేరకు రఫిక్ ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు సమాచారం.కాగా, సోమాజీగూడలోని మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు ముగిశాయి. ఉదయం 5 గంటల నుంచి ఆయన ఇంట్లో రెండు సంస్థలకు చెందిన అధికారులు తనిఖీలు నిర్వహించారు. రెండు రోజుల క్రితం బ్యాంకు ఖాతాలో నగదు బదిలీకి సంబంధించిన పత్రాలను పరిశీలించారు.