షర్మిల ట్రాప్ లో జగన్…
విజయవాడ,జూలై 31
Jagan in Sharmila Trap…
కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న వైఎస్ షర్మిల, మాట్లాడిన ప్రతీసారి ప్రత్యేక హోదా విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఈ విషయంలో అప్పటి జగన్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. హోదాని తన సొంతం కోసం వాడుకుంటున్నారని దుమ్మెత్తిపోశారామె. అప్పుడే కాదు.. ఇప్పుడు అదే దూకుడు ప్రదర్శి స్తున్నారు. ఎక్స్ వేదికగా వైసీపీని తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. వైసీపీ నేతలకు పోరాడటం చేత కాదని ఓపెన్‌గా చెబుతున్నారు. వైసీపీ నేతలకు మీడియా పాయింట్ ఎక్కువన్నారు.ఒక్కమాటలో చెప్పాలంటే అధికార కూటమి కంటే.. వైసీపీని ఎక్కువగా దుయ్యబడుతున్నారు వైఎస్ షర్మిల. ఎందుకంటే జగన్ తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని ఎండగడుతున్నారు. ఇక షర్మిల మొదటి నుంచి ప్రత్యేక హోదా పల్లవిని ఎత్తుకున్నారు.. దాన్ని కంటిన్యూ చేస్తున్నారు కూడా. వైసీపీ వద్ద ఎలాంటి అస్త్రాలు లేకపోవడంతో షర్మిల ఎత్తుకునే హోదా అస్త్రాన్ని ఐదేళ్ల తర్వాత మళ్లీ వైసీపీ ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది. ఒకవిధంగా చెప్పుకోవాలంటే వైఎస్ షర్మిల ట్రాప్‌లో జగన్ పడ్డారని కొందరు నేతలు ఓపెన్‌గా చెబుతున్నారు.లోక్‌సభలో మళ్లీ వైసీపీ, ప్రత్యేకహోదా పల్లవిని ఎత్తుకుంది. బడ్జెట్‌పై జరిగిన చర్చలో మాట్లాడిన ఎంపీ మిథున్‌రెడ్డి, ప్యాకేజీని అక్కడి ప్రజలు అంగీకరించరన్నారు. హోదా కావాలని గడిచిన ఐదేళ్లలో టీడీపీ డిమాండ్ చేసిందని, దానికి వాళ్లు కట్టుబడి ఉండాలన్నారు. ఈ విషయంలో టీడీపీతో కలిసి తాము నడవడానికి సిద్ధంగా ఉన్నామంటూ సంకేతాలు ఇచ్చారు. ఏపీలో టీడీపీ అధికారంలో ఉండగా జగన్ ఇదే స్ట్రాటజీని అవలంభించారు. ఎన్డీయే నుంచి టీడీపీ దూరమైంది. ప్రధాని మోదీ సైతం జగన్ ట్రాప్‌లో చంద్రబాబు పడ్డారని అప్పట్లో ప్రస్తావించిన విషయం తెల్సిందే.ఇప్పుడు అదే చేయాలన్నది మాజీ సీఎం ఆలోచనగా కనిపిస్తోంది. మొత్తానికి జగన్ వద్ద అస్త్రాలు లేక పోవడంతో షర్మిల పల్లవిని ఎత్తుకున్నారని అంటున్నారు. బీజేపీకి రాజ్యసభలో బలం లేదు. ముఖ్యంగా వైసీపీ మద్దతు ఆ పార్టీకి అవసరం. హోదాపై ప్రధానమంత్రి వద్ద వైసీపీ డిమాండ్ చేస్తే బాగుంటుందని అంటున్నారు. దీనిపై సభలో మాట్లాడితే ఫలితం ఉండదని అంటున్నారు నేతలు. అందివచ్చిన ఈ అవకాశాన్ని వైసీపీ వినియోగించుకుంటుందా? లేక సొంత వ్యవహరాల కోసం వాడుకుంటుందా? అనేది చూడాలి.