గారడీ మాటలు..దాగుడు మూతలు
Juggling words..hiding
మూసీ డీపీఆర్‌ను సర్కారు దాచే ప్రయత్నం
ప్రివిలేజ్ నోటీసుతో బయటపడ్డ బండారం
ఇది ముమ్మాటికీ బీఆర్‌ఎస్ విజయం:
ఎమ్మెల్సీ కవిత
మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్ పై ప్రభుత్వం దాగుడు మూతలాడుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. సీవరేజ్ లైన్ల నిర్మాణానికి 4100 కోట్ల డీపీఆర్ సమర్పించామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరమని విమర్శించారు. చిన్న భాగానికే అంత అవసరమైతే ప్రాజెక్ట్ మొత్తానికి ఎంతవుతుందని ప్రశ్నించారు. శాసనమండలి మీడియా పాయింట్‌లో కవిత మాట్లాడుతూ ప్రభుత్వంపై ఇచ్చిన సభాహక్కుల నోటీసులకు సమాధానం చెప్పే సందర్భంలో మంత్రి శ్రీధర్‌బాబు గారడి మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. మూసీ ప్రాజెక్ట్ ముసుగులో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీసిందని ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లోని నిరుపేదల భూములను ప్రపంచబ్యాంకు కు అప్పగించేందుకే కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. ప్రపంచబ్యాంకు కోరడం వల్లే డీపీఆర్ సమర్పించామని మంత్రి చెప్పడంతో సర్కారు బండారం బయటపడ్డదని నిప్పులు చెరిగారు. ఇదీ ముమ్మాటికీ బీఆర్‌ఎస్ విజయమేనని స్పష్టం చేశారు.
చట్టం కాకముందే ప్రకటనలేందుకు? మధుసూదనాచారి
ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతుండగానే పత్రికల్లో ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రకటనలేందుకు చేస్తున్నదని శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రభుత్వ సలహాదారులను నియమిస్తే విమర్శించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నారని నిలదీశారు. ఆయన ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ మండలి నుంచి వాకౌట్ చేశామని చెప్పారు. ఈ ప్రభుత్వం రైతుబంధును ఎగ్గొట్టి నిండా ముంచిందని విమర్శించారు.
మూసీపై ఇచ్చింది డీపీఆర్ కాదు పీపీఆర్: శ్రీధర్‌బాబు వెల్లడి
మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు అంశంలో మంత్రి శ్రీధర్‌బాబు తప్పుడు సమాచారం ఇచ్చి, సభను తప్పుదోవ పట్టించారంటూ బీఆర్‌ఎస్ ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్‌ను గురువారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అనుమతించారు. దీంతో మంత్రి శ్రీధర్‌బాబు బీఆర్‌ఎస్ సభ్యులకు సమాధానం చెప్పారు. మంత్రి చెప్పిన సమాధానంపై ప్రివిలేజ్ మోషన్ పెట్టడం రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలోనే మొదటిసారి అని సభ్యులు పేర్కొన్నారు. మూసీ నదీ డెవలప్‌మెంట్‌పై పీపీఆర్ ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్, తయారుచేశామని, ఆ విషయాన్ని వెబ్‌సైట్ లో కూడా పొందుపర్చామని శ్రీధర్‌బాబు తెలిపారు. డీపీఆర్ డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఇంకా సబ్మిట్ చేయలేదని, ప్రపంచబ్యాంక్ నిధులు ఇచ్చే అవకాశం ఉంటే తక్కువ వడ్డీకి తీసుకోవాలని అనుకుంటున్నామని చెప్పారు. ఇంకా ప్రపంచబ్యాంకును సంప్రదించ లేదని స్పష్టంచేశారు. డీపీఆర్ సిద్ధమైన తర్వాత ఆ అంశాలను కచ్చితంగా సభ ముందు పెడుతామని వెల్లడించారు. మొత్తం డీపీఆర్ తయారు చేయడానికి ఆరు దశలు ఉంటాయని, ఇది కేవలం ప్రైమరీ దశ మాత్రమే అని వివరించారు.