జంపింగ్ జంపాంగ్ లు
కరీంనగర్, జనవరి 30, (వాయిస్ టుడే )
Jumping jumps
ఎన్నికలు వచ్చాయంటే చాలు జంపింగ్ జపాంగ్ ఘటనలు పెరిగిపోతుంటాయి. పార్టీ తనకు సీటు ఇవ్వలేదని, మరో పార్టీ కండువా కప్పుకుంటారు. అక్కడ చేదు అనుభవం ఎదురైతే, మరో పార్టీలోకి లేక నేతల బుజ్జగింపులతో తిరిగి సొంతపార్టీలోకి తిరిగి వస్తుంటారు. తెలంగాణ పురపాలక ఎన్నికల సమయంలో జగిత్యాల జిల్లా కోరుట్లలో ఇలాంటి సీన్ రిపీట్ అయింది. కౌన్సిలర్ టికెట్ కోసం ఒక నాయకుడు ఉదయం ఒక పార్టీలో చేరి, రాత్రికి మరో పార్టీ గూటికి చేరుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
కోరుట్ల పట్టణంలోని 8వ వార్డు నుంచి పోటీ చేసేందుకు తోట గంగాధర్ అనే నాయకుడు కొద్ది రోజులుగా కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అదే వార్డు నుంచి పార్టీ తరఫున మరొకరు ప్రయత్నిస్తుండటం, తనకు టికెట్ హామీ రాకపోవడంతో ఉదయం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గురువారం ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, గంగాధర్ ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనకు, ఆయన మద్దతుదారులకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తోట గంగాధర్‌తో మాజీ కౌన్సిలర్ హమీద్, 20 మంది యువకులు గులాబీ కండువా కప్పుకున్నారు.ఈ విషయం కాంగ్రెస్ ముఖ్య నాయకులకు తెలియడంతో వారు వెంటనే అప్రమత్తమయ్యారు. రాత్రికి తోట గంగాధర్‌ను మెట్‌పల్లిలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు పిలిపించి చర్చలు జరిపారు. చివరకు 8వ వార్డు అభ్యర్థిగా గంగాధర్‌ను ప్రకటిస్తూ, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి జువ్వాడి నర్సింగరావు ఆయనకు కండువా కప్పి తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారు. సీటు కోసం జంపింగ్ జపాంగ్ అంటూ స్థానికులు అంటున్నారు.


