లక్నో :అక్టోబర్ 13: వన్డే ప్రపంచకప్ లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో ఆస్ట్రేలియా 134 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవి చూసింది. ఆరంభ పోరులో టీమిండియా చేతిలో ఓడిన ఆస్ట్రేలియా.. ఇప్పుడు సౌతాఫ్రికా చేతిలోనూ కంగుతింది.

312 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. మార్నస్ లబుషేన్ 74 బంతుల్లో 46 పరుగులతొ టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిచెల్ స్టార్క్ (27), ప్యాట్ కమిన్స్ (22) పరుగులు చేయగా.. మిగిలిన బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు.

సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడ 3 వికెట్లతో మెరిశాడు. మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్ లకు చెరో రెండు వికెట్లు లభించాయి.
తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్లకు 311 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (106 బంతుల్లో 109) మరోసారి సెంచరీతో కదం తొక్కాడు.
ఎయిడెన్ మార్క్రమ్ (44 బంతుల్లో 56) అర్ధ శతకంతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్ వెల్ చెరో 2 వికెట్లతో మెరిశారు..