కన్నడ మంత్రికి రన్యారావుతో లింక్…
బెంగళూరు, మార్చి 11, (వాయిస్ టుడే )
Kannada Minister has a link with Ranya Rao...
బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ నటి రన్యా రావు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కర్ణాటక అసెంబ్లీలో రచ్చ రచ్చ జరిగింది. అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన నటి రన్యా రావు వెనుక ఉన్న మంత్రి ఎవరే విషయంపై తీవ్ర కలకలం రేగింది. ఆమె వెనుక ఉన్నది ఎవరో బహిర్గతం చేయాలంటూ సభలోని బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో కొద్ది సేపు తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. ఈ కేసు గురించి తనకు ఎటువంటి సమాచారం లేదని హోంమంత్రి చెప్పడంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మండిపడ్డారు. నటి రన్యా రావు కేసుకు సంబంధించి, బంగారం స్మగ్లింగ్ వెనుక ఉన్న మంత్రి ఎవరు? అని బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సభలో ప్రశ్న లేవనెత్తారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. హోంమంత్రి పరమేశ్వర తనకు తెలియదని చెప్పడంతో ఒక్కసారిగా సభలో వివాదం చెలరేగింది.అయితే సభలో మంత్రి ఎవరో చెప్పకపోయినా.. బంగారం అక్రమ రవాణా వెనుక బడా నేత ఉన్నట్లు సమాచారం. ఆదివారం ఈ కేసు వెనుక మంత్రి ఉన్నారని బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం కూడా ఇదే అంశం సభలో లేవనెత్తడంతో గందరగోళం చోటు చేసుకుంది. అసెంబ్లీ జీరో అవర్ సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తిన కర్కల బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, బంగారం అక్రమ రవాణాకు పోలీసులే ప్రోటోకాల్ ఇచ్చారని అనుమానం వ్యక్తం చేశారు. దీని వెనుక మంత్రి ఎవరో ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. దీనిపై హోంమంత్రి పరమేశ్వర్ స్పందిస్తూ.. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని అన్నారు.ఈ కేసు గురించి మీకు ఎంత తెలుసో, తమకూ అంతే తెలుసని అన్నారు. ఆ మంత్రి ఎవరో సీబీఐ కనుక్కోవాలని ఆయన అన్నారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని సునీల్ కుమార్ దీన్ని మీరే సీబీఐకి ఇవ్వండి అని డిమాండ్ చేశారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని మంత్రి వెల్లడించారు. కానీ, బీజేపీ ఎమ్మెల్యే మాత్రం.. ఎవరినో రక్షించడానికి ఇదంతా జరుగుతుందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. స్పీకర్ ఖాదర్ జోక్యం చేసుకుని కేసు దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. అయితే ఈ కేసులో రన్యా రావు వెనుక ఒక మంత్రి ఉండి బంగారం అక్రమ రవాణా చేయించారనే ఆరోపణలు కర్ణాటక ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. అలాగే బీజేపీ అంశాన్ని బలంగా పట్టుకుంది.