ఈ నెలాఖరులో కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం

కరీంనగర్: కరీంనగర్ జిల్లా ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నూతన కలెక్టరేట్ భవనాన్ని ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్మితమైన నూతన కలెక్టరేట్‌ను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి మంత్రి పరిశీలించారు. భవనంలోని వివిధ విభాగాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు.
మంత్రి మాట్లాడుతూ నూతన కలెక్టరేట్ జిల్లా అభివృద్ధికి పరిపాలనా కేంద్ర బిందువుగా నిలుస్తుందని పేర్కొన్నారు. గతంలో ప్రారంభమైన నిర్మాణ పనులు వివిధ కారణాలతో ఆలస్యమయ్యాయని, కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రత్యేక చొరవతో మిగిలిన పనులు వేగంగా పూర్తయ్యాయని ఆయన అభినందించారు.
ఈ నెలాఖరులో జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని మంత్రి వెల్లడించారు. అనంతరం మున్సిపల్ శాఖకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే శాతవాహన విశ్వవిద్యాలయంలో చేపట్టిన అభివృద్ధి పనులు కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు.
కలెక్టరేట్‌ను అన్ని ఆధునిక సౌకర్యాలు, సాంకేతిక వసతులు, పౌర సేవలకు అనుకూలమైన విధంగా రూపొందించినట్లు మంత్రి పేర్కొన్నారు. సుడా ఆధ్వర్యంలో గ్రీనరీ, ల్యాండ్‌స్కేపింగ్ పనులు చేపట్టి పర్యావరణ హిత వాతావరణాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు.
జిల్లా కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలను ఒకే ప్రాంగణంలోకి తీసుకువచ్చి ప్రజలకు మరింత సులభమైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరీంనగర్‌ను రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
విద్యా రంగంలో శాతవాహన విశ్వవిద్యాలయం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు, లా కాలేజీ, ఫార్మసీ కాలేజీ ఏర్పాటు ద్వారా ఉన్నత విద్యా అవకాశాలు పెరిగాయని చెప్పారు. ఆరోగ్య రంగంలో కరీంనగర్‌ను హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.




