ఉగాది తర్వాత జనాల్లోకి కేసీఆర్
హైదరాబాద్, మార్చి 29,
తొమ్మిదేళ్ల పాలనానంతరం అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ భారీ దెబ్బను చవిచూసింది. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. అందుకు గల కారణాలను గత మూడు నెలలుగా సమీక్షించుకుంటూ వస్తుంది. ఊహించని ఓటమిని చవిచూసిన గులాబీ దళపతి కేసీఆర్.. ఫామ్ హౌస్‌కే పరిమితమైపోయారు. కానీ నియోజకవర్గాలుగా సమీక్షలు నిర్వహిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో వేసిన తప్పటడుగులను గుర్తిస్తున్నారు. ఇదే సమయంలో విజయ గర్వం మీదున్న కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి దూకడుకు కళ్లెం వేసేలా అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంటున్నారు.ఎన్నికలు ముగిసిన వెంటనే అసెంబ్లీ సమావేశాలు కొనసాగడం.. అదే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి అంటూ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై విచారణ, గొర్రెల స్కాం, దళితబంధులో అవినీతి, ఫోన్ ట్యాపింగ్ ఇలా ఒక్కొక్కటి బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే లోక్ సభ ఎన్నికల నగారా మోగడంతో గులాబీ పార్టీకి ఊపిరి తీసుకునే సమయమే దొరకడం లేదు. ఇక సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ లీడర్లు చేసే కామెంట్లపై బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీశ్ రావు మాత్రమే కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. ఇక మిగిలిన నేతల్లో చాలా మంది సైలెంట్ కాగా, అడపాదడపా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, కడియం శ్రీహరితోపాటు ఇద్దరు ముగ్గురు మాత్రమే కౌంటర్ ఇస్తున్నారు. ఇక అధికారం కోల్పోయామన్న నైరాశ్యంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక లీడర్లు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఈక్రమంలో లోక్ సభ ఎన్నికల్లో ఎలా గట్టెక్కాలి..? ఎలాంటి ప్రచార అస్త్రాలు సంధించాలి..? ఇలా కాంగ్రెస్‌ను ఢీకొట్టే వ్యూహాలను కేసీఆర్ రెడీ చేసినట్లు సమాచారం.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తుంటి ఎముక విరిగి ఆస్పత్రి పాలుకావడం, ఆ తర్వాత ఫామ్ హౌస్‌కే మాజీ సీఎం కేసీఆర్ పరిమితం అయ్యారు. మధ్యలో నల్లగొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు మాత్రమే హాజరయ్యారు. ఇక ఇన్ని రోజులు ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో ఉన్న కేసీఆర్ ఉగాది తర్వాత నేరుగా ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారని గులాబీ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులుగా చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేలా వ్యూహాలను రచించుకున్న కేసీఆర్.. బస్సు యాత్ర చేపట్టి రాష్ట్రం మొత్తం ప్రచారం చేపట్టేలా ప్లాన్ చేసుకున్నారట. ఈ యాత్రలోనే కాళేశ్వరంపై క్లారిటీ, కవిత అరెస్ట్, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, చేకూరిన లబ్ధి.. కాంగ్రెస్ చేస్తున్న ‘అవినీతి’ ఆరోపణలపై ప్రజల మధ్యనే గట్టి కౌంటర్ ఇచ్చేలా అస్త్రశస్త్రాలు రెడీ చేసుకున్నారని సమాచారం. అన్ని లోక్ సభ నియోజకవర్గాలను చుడుతూ రోడ్డు షోలు చేయనున్నారు.కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీశ్ రావు ఈ యాత్రలో ప్రముఖంగా పాలుపంచుకోనున్నారు. ఉగాది పండుగ ఏఫ్రిల్ 9న వస్తుండగా.. అదే వారంలో కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా ఈసారి ప్రచారం ఉండబోతుందని తెలుస్తోంది. పార్టీ మారేవారిని కూడా అడ్డుకోద్దని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గులాబీ బాస్ మళ్లీ పాత కేసీఆర్‌లా మారితేనే బీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉంటుందని, పార్టీకి పూర్వవైభవం వస్తుందని బీఆర్ఎస్ నాయకుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఉగాది తర్వాత జనాల్లోకి కేసీఆర్
- Advertisement -
- Advertisement -