బిఆర్ఎస్ 5 లక్షల మందితో కేసీఆర్ సభ త్వరలో గజ్వేల్‌లో నిర్వహణ
KCR Sabha with 5 lakh people of BRS will soon be held in Gajwel
ప్రభుత్వ వైఫల్యాలే ఎజెండా
హైదరాబాద్
కాంగ్రెస్ సర్కారు పాలనా వైఫల్యాల పై నిలదీసేందుకు బీఆర్‌ఎస్ పార్టీ సిద్ధమవుతోంది
గజ్వేల్‌లో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. నేను కొడితే మామూలుగా ఉండదు తొందర్లోనే భారీ బహిరంగసభ పెడదాం అని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇటీవలే పార్టీ శ్రేణులతో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే సభ నిర్వహణకు గులాబీ పార్టీ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనా వైఫల్యమే అజెండాగా ఈ సభను నిర్వహించాలని కారు పార్టీ భావిస్తోంది. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లోనే సభను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కేసీఆర్ ఆదేశాలతో ఆ పార్టీ నేతలు బహిరంగ సభ నిర్వహణకు అనువైన స్థలాన్ని గుర్తించే పనిలో పడ్డారు. త్వరలోనే 5 లక్షల మందితో భారీ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
సభకు అన్ని రకాలుగా అనువైన స్థలాన్ని గుర్తించిన తర్వాత ఏర్పాట్లు, జనం తరలింపు, ప్రజలను ప్రభావితం చేసేలా ఏయే అంశాలను ప్రస్తావించాలన్న దానిపై కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. కాగా, ఇటీవల జగిత్యాల నియోజకవర్గం బీఆర్‌ఎస్ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్. గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా ఎన్నో ప్రభుత్వాలను చూశా కానీ, ఇలాంటి సర్కారును ఎన్నడూ చూడలేదు. ఏడాదిలోపే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత వచ్చింది, అని చెప్పిన విషయం తెలిసిందే. రైతు భరోసా, రుణమాఫీ, రైతు ఆత్మహత్యలు, నేతన్నలు, ఆటో కార్మికులు ప్రాణాలు తీసుకోవడం వంటి వాటిపై రేవంత్ సర్కారును కేసీఆర్ నిలదీస్తారని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తున్న అంశంతో పాటు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఈ సభలో లేవనెత్తుతారని పేర్కొంటున్నాయి.