సిద్దిపేట నవంబర్ 28 : దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్న ఆ భూమి ఇవ్వకపోగా ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కున్నారని బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనంలో ఈటల రాజేందర్, ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణమాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి మాట్లాడుతూ.. పేద వాళ్ళను కొట్టి పెద్ద వాళ్లకు పెడుతున్నారని ఆరోపించారు. కొండపాక కలెక్టర్ కార్యాలయం నిమిత్తం 25 ఎకరాల భూమి అవసరం అయితే 350 ఎకరాల భూమిని తీసుకొని మిగతా భూమిని ప్లాట్లుగా చేసి అమ్ముకున్నారన్నారు.పేద వాళ్లకు కోట్ల విలువ చేసే భూములు ఉండకూడదనే కేసీఆర్ ఉద్దేశమన్నారు. మాదిగ ఉపకులాల వర్గీకరణ కావాలని 30 ఏళ్లుగా పోరాడిందని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు మాదిగవర్గీకరణ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసిన అభివృద్ధిని కూడా తమ ఖాతాలలో వేసుకున్న పరిస్థితి కేసీఆర్ దని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ కండువా వేసుకోకపొతే వాళ్లకు ఓటు వేయకపోతే తెలంగాణ గడ్డమీద బ్రతకనివ్వమని, కేసులు పెడతామని బెదిరించే పరిస్థితి ఏర్పడిందన్నారు. చొప్పదొండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుడిగే శోభ ఇంట్లో అక్రమ తనిఖీలు చేసిన పోలీసుల వైఖరిని ఖండిస్తున్నామన్నారు. పోలీసులు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయం పై ఏన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.