20 అంటున్న కేసీఆర్… 80 అంటున్న రేవంత్
హైదరాబాద్, నవంబర్ 23, (వాయిస్ టుడే): ఆఖరి ఘట్టానికి మరో 8 రోజులు మిగిలి ఉన్నాయి.. దానికి తగ్గట్టుగానే గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ప్రచార పర్వంలో జోరు పెంచారు. అనుకున్నట్టుగానే ప్రతీ రోజూ 4 నియోజకవర్గాలను కవర్ చేస్తూ.. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తమ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలను ప్రజలకు వివరిస్తూ.. విపక్షాలపై విరుచుకుపడుతున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ, బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు, కొడంగల్, మహబూబ్ నగర్, పరిగి నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగించారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఎన్నికల ప్రచారం హిట్ పెరుగుతోంది. కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య పరస్పర సవాళ్లు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో పెద్దగా రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించడానికి ఇష్టపడని కేసీఆర్ ఇటీవలి కాలంలో ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. నేరుగా పేరు పెట్టి మండిపడుతున్నారు. తాజాగా కొడంగల్ బహిరంగసభలో ఆయన చేసిన రేవంత్ పై విరుచుకుపడ్డారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీఎం కేసీఆర్ కొడంగల్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.కొడంగల్ లో ఏర్పాటు చేసిన ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. జై తెలంగాణ అంటే తుపాకీతో కాలుస్తా అని రేవంత్ రెడ్డి అన్నారన్నారు. రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడని కాంగ్రెస్ నేతలే చెప్పారన్నారు. ఎమ్మెల్యేలను కొనేందుకు పోయి రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడన్నారు. చిప్పకూడు తిన్నా.. రేవంత్ రెడ్డికి సిగ్గు రాలేదన్నారు. కాంగ్రెస్ లో సీఎం పదవి కోసం 15 మంది పోటీ పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు రావన్నారు. రేవంత్ రెడ్డి పెద్ద భూకబ్జాదారుడన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అవతారని ప్రచారం చేస్తున్నారని.. కానీ అదంతా ఫేక్ అన్నారు. ఆ ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. బుధవారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. పదవి పోతుందన్న భయంతో కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
కేసీఆర్ రాసిపెట్టుకో.. కాంగ్రెస్ కు 80 సీట్ల కంటే ఒక్క సీటు తగ్గదు
కాంగ్రెస్‌కు 20 సీట్లు కూడా రావని అంటున్నాడని.. నిజామాబాద్ రూరల్ గడ్డ మీది నుంచి సూటిగా సవాల్ చేస్తున్నా.. గుర్తుపెట్టుకో బిడ్డా.. కాంగ్రెస్‌కు 80 సీట్ల కంటే ఎక్కువే రాబోతున్నాయి. డిసెంబర్ 3వ తేదీన లెక్కపెట్టుకోవాలని ఛాలెంజ్ చేశారు. వితను ఓడించినప్పటి నుంచి కేసీఆర్ నిజామాబాద్ జిల్లాపై కక్ష పెంచుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌కు రెండు సార్లు అవకాశం ఇస్తే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ఈ ప్రాంతంలోని ఎర్రజొన్న రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయలేదని, షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించలేదని, పసుపు రైతులను పట్టించుకోలేదని విమర్శించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదన్నారు. ఎన్నికలు రాగానే కేసీఆర్ బక్క పలుచని వ్యక్తి అంటూ ప్రచారం చేస్తున్నాడని వందల కోట్లు, వేల ఎకరాలు దోచుకునేటప్పుడు కేసీఆర్, కేటీఆర్‌లు పోటీ పడతారని ప్రజలకు సేవా చేయాలన్నప్పుడు మాత్రం కేసీఆర్ బక్క పలుచని వాడు, కేటీఆర్ తిరుగుబోతు అవుతున్నాడని విమర్శించారు.కేసీఆర్ ఇందిరమ్మ రాజ్యంపై మాట్లాడుతున్నాడని.. బరాబర్ ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తామన్నారు. మేము కట్టిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టును చూపించి కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని.. కేసీఆర్ మేడిగడ్డను చూపించి ఓట్లు అడగాలని ఛాలెంజ్ చేశారు. కేసీఆర్ మూతిమీదున్న మీసాలున్న మొనగాడివే అయితే ఈ ఛాలెంజ్‌కు అంగీకరించాలన్నారు. రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆరు గ్యారెంటీలతో పాటు పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తామన్నారు. బీఆర్ఎస్ ఉంటే 2 వేలే పింఛన్ ఇస్తారని అదే కేసీఆర్‌ను బొంద పెడితే ఇందిరమ్మ రాజ్యంలో 4 వేల పింఛన్ ఇస్తామన్నారు.