కరీంనగర్ లోనే కేసీఆర్ మకాం
హైదరాబాద్, ఫిబ్రవరి 2
భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణకు పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇక తన మకాం కరీంనగర్‌కు మార్చబోతున్నారా.. అక్కడి నుంచే పార్టీని నడిపించబోతున్నారా? ఎంపీ ఎన్నికలు అయ్యే వరకు కరీంనగర్ కేంద్రంగానే పనిచేయబోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది గులాబీ భవన్ నుంచి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్‌ఎస్ చూస్తోంది. ఈ ఎన్నికల్లో కూడా గత సీట్లకన్నా తగ్గితే పార్టీ ఉనికే ప్రశ్నార్థకం అవుతుందని గులాబీ నేతలు గుబులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా తన మకాం ఉత్తర తెలంగాణకు మార్చాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.కరీంనగర్ ఉద్యమాల గడ్డ. బీఆర్‌ఎస్‌కు కంచుకోట. 2014, 2018 ఎన్నికల్లో 13 స్థానాలు ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 బీఆర్‌ఎస్ గెలిచింది. కానీ 2023లో కాంగ్రెస్‌కు 13 స్థానాల్లో 10 చోట్ల ఓడిపోయింది. కేవలం జగిత్యాల, కరీంనగర్, హుజూరాబాద్‌లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని కరీంనగర్ నుంచే నడిపించాలని చూస్తున్నారు.ప్రస్తుతం కరీంనగర్‌తోపాటు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో బీజేపీ బలంగా ఉంది. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీగా అర్వింద్, ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాపూరావు ఉన్నారు. ఈ ముగ్గురూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమంటున్నారు. మరోవైపు ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ బలహీనంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూడు స్థానాల్లో బీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయడంతోపాటు బీజేపీని ఓడించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకోసమే తన మకాం కరీంనగర్‌కే మార్చాలనుకుంటున్నారు. తద్వారా ఉత్తర తెలంగాణలో బలపడుతున్న బీజేపీని దెబ్బతీయాలని చూస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిజాబాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఆరు నియోజవర్గాల్లో బీజేపీ గెలిచింది. దీంతో కేసీఆర్ బీజేపీనే టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తన ఫాంహౌస్‌లో కాలుజారి పడ్డారు. తుంటి ఎముక విరగడంతో సర్జరీ కూడా అయింది. ప్రస్తుతం ఆయన కోలుకుని చేతికర్ర సహాయంతో నడుస్తున్నారు. ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే కేసీఆర్ కరీంనగర్‌కు వస్తారని తెలుస్తోంది. ఈమేరకు ఉత్తర తెలంగాణ భవన్‌లో మార్పులు చేస్తున్నారు. తీగలగుట్టపల్లిలోని భవనంలో కేసీఆర్ ఉండేందుకు అనుగుణంగా మార్పులు చేశారు. తుంటి ఎముక ఆపరేషన్ నేపథ్యంలో భవనంలో లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు. మంచి రోజులు చూసుకుని కేసీఆర్ తన మకాం కరీంనగర్‌కు మారుస్తారని తెలుస్తోంది.
కరీంనగర్ లోనే కేసీఆర్ మకాం
- Advertisement -
- Advertisement -