తాజ్ బంజారాకు తాళం*
Key to Taj Banjara*
జీహెచ్ఎంసీకి ఆస్తి పన్ను రూ.1.47కోట్లు పెండింగ్ హైదరాబాద్ స్టార్ హెటళ్లకు గడ్డు కాలం? గిరాకీ అంతా ఎయిర్ పోర్ట్ సమీపంలోని వాటికే లేదంటే ఐటీ కారిడార్ లోని స్టార్ హోటళ్లకు డిమాండ్ కోర్ హైదరాబాద్ లోని హోటళ్ల వైపు చూడని కార్పొరేట్లు విదేశీ యాత్రికులు, బిజినెస్ మెన్లు ఎయిర్ పోర్ట్ హోటళ్లకే? హోటల్ తాజ్ బంజారా. హైదరాబాద్ కే ఒక బ్రాండ్ అంబాసిడర్ వంటి ఫైవ్ స్టార్ హోటల్. ఎన్నో సినిమాల్లో కనిపించడమే కాకుండా.. దశాబ్దాలుగా లక్షలాది మంది దేశ, విదేశీ అతిథులకు ఆతిథ్యం ఇచ్చిన ఈ హోటల్.. ఇప్పుడు కష్టాల్లో పడింది. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించడంలో విఫలమైనందున… ఆ హోటల్ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1లో గల తాజ్ బంజారా హోటల్ నుంచి రూ.1.43 కోట్ల మేర పన్ను బకాయిలు రావాల్సి ఉందని, ఇప్పటికే ఐదు సార్లు నోటీసులు ఇచ్చినా యాజమాన్యం పట్టించుకోలేదని అధికారులు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం చివరి హెచ్చరిక జారీ చేసినా స్పందించకపోవడంతో హోటల్ ప్రధాన ద్వారాలకు తాళాలు వేసినట్లు వెల్లడించారు. కళ తప్పిన హోటల్ పరిశ్రమ కరోనా పరిస్థితుల తర్వాత రాష్ట్రంలో హోటల్ పరిశ్రమ కళ తప్పింది. ప్రధానంగా హైదరాబాద్ నడిబొడ్డున దశాబ్దాలుగా కొనసాగుతున్న స్టార్ హోటళ్లన్నీ ఆక్యుపెన్సీ తగ్గిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి హోటళ్లకు ప్రధానంగా కార్పొరేట్, ఐటీ సంస్థల మీటింగ్ లు, వివాహ వేడుకల ద్వారానే ఆదాయం వస్తుంది. కానీ, మారిన పరిస్థితుల నేపథ్యంలో కార్పొరేట్, ఐటీ సెక్టార్లలో మీటింగ్ లు తగ్గిపోయాయి. దీనికితోడు మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, నానక్ రామ్ గూడ్ ప్రాంతాల్లో భారీగా కొత్త హోటళ్లు ఏర్పాటు కావడంతో చిన్న, పెద్ద సంస్థల మీటింగ్ లు, ఈవెంట్లు అక్కడే కొనసాగుతున్నాయి. అలాగే, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు దగ్గర్లో ఉన్న హోటళ్లలో విదేశీ ప్రతినిధుల సమావేశాలు జరుగుతున్నాయి. ఒకప్పడు ఐటీ, ఎయిర్ పోర్ట్ సెక్టార్ లో నాలుగైదుగా ఉన్న హోటళ్లు ఇప్పుడు పదుల సంఖ్యకు చేరాయి. దీనికితోడు కార్పొరేట్ రాయితీలు, తరచూ వచ్చే వారికి డిస్కౌంట్ల పేరిట ఆ హోటళ్లు ఆకర్షిస్తున్నాయి. ఒక సారి అక్కడ సమావేశమైన వారు.. మళ్లీ అక్కడికి వెళ్లడానికే ప్రాధాన్యమిస్తున్నారు. ఈ కారణాలతో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ప్రధాన స్టార్ హోటళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని హోటళ్లయితే సిబ్బందికి జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేకపోతున్నాయి. తాజ్ బంజారా హోటల్ దీ అటు ఇటుగా ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలిసింది.