ఖమ్మం కాంగ్రెస్ లో కొత్త ముఖం..
ఖమ్మం, ఏప్రిల్ 11
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ముగ్గురికి కీలక పదవులను దక్కాయి. రాష్ట్ర రాజకీయాల్లో వారు ఇప్పుడు “కీ”రోల్ పోషిస్తున్నారు. ఒకే జిల్లాకు చెందిన నేతలైనప్పటికీ కేబినెట్ లో ఆ ముగ్గురికి దక్కిన అరుదైన గౌరవం మరెవరికీ దక్కలేదు. అయినా సరే ఆ ముగ్గురూ అధిష్టానం దగ్గర మరింత అత్యాశపడ్డారు. తమ కుటుంబ సభ్యులకు పదవి కావాలని పాకులాడారు. ఈ పరిణామాన్ని నిశితంగా గమనించిన కాంగ్రెస్ అధిష్టానం మెల్లగా ఆ ముగ్గురికీ చురక వేసింది. మీకు ఇక “నో ఛాన్స్” అంటూ సున్నితంగానే చేయిచ్చింది.గత కొంత కాలంగా ఖమ్మం పార్లమెంటు స్థానం అందరి నోళ్లలోనూ హాట్ టాపిక్ గా మారింది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు తమ వారి కోసం పాకులాడటమే ఇందుకు ప్రధాన కారణంగా మారింది. రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలుకుసుమ కుమార్, వి.హనుమంతరావు సైతం ఈ టిక్కెట్ కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ టిక్కెట్ కు మరింత పోటీ పెరిగింది. అయితే కేబినెట్ లో కీలక పదవులు అనుభవిస్తూ మళ్లీ తమ కుటుంబ సభ్యులకు పదవులు కావాలని పోటీ పడిన ముగ్గురు మంత్రుల వ్యవహారం విమర్శలకు దారితీసింది. ఎంతో సున్నితమైన ఈ అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం సునిశితంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతోంది. మంత్రుల కుటుంబ సభ్యలెవరికీ ఖమ్మం ఎంపీ టిక్కెట్ ఇచ్చే ప్రసక్తిలేదని అధిష్టానం ఎట్టకేలకు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తమ సతీమణికి టిక్కెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అలాగే రెవెన్యూ మంత్రి పొంగులేటితన సోదరుడు ప్రసాద్ రెడ్డికి టిక్కెట్ ఇప్పించుకునే ప్రయత్నాలు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం తన కుమారుడు యుగంధర్ కి టిక్కెట్ కావాలని పట్టుపట్టారు. కాగా అధిష్టానం పెద్దలు వీరు మినహా వేరే పేర్లు సూచించాలని కోరినట్లు వినికిడి. దీంతో ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. ముగ్గురు మంత్రులతో అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఆయన ఆంతరంగికులు సైతం చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ ఫలితంగా ఇప్పటి వరకు ఒకరికొకరు తీవ్రంగా పోటీ పడిన ఈ ముగ్గురు అమాత్యులు అనివార్యంగా పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు స్పష్టమవుతోంది.తీవ్రమైన పోటీ నెలకొన్న ఖమ్మం పార్లమెంట్ టిక్కెట్ రేసులో ఏకంగా ముగ్గురు మంత్రులు పోటీ నుంచి తప్పుకోవడంతో తిరిగి మిగిలిన ఆశావహుల ఆశలు ఊపిరి పోసుకున్నాయి. ఇక ఎవరికి వారుగా తమ ప్రయత్నాలను యథావిధిగా మొదలుపెట్టారు. జిల్లాకు చెందిన మంత్రులను తమ ప్రయత్నాలను విరమించుకోవాలని చెప్పిన ఏఐసీసీ వారినే ఎంపీ అభ్యర్థిని సూచించాలని కోరడం గమనార్హం. దీంతో మంత్రులు అయోమయంలో పడ్డారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. కాగా బీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థి నామా నాగేశ్వరరావునే తిరిగి బరిలో నిలపగా, బీజేపీ వినోద్ రావుకు టిక్కెట్ ఇచ్చింది. అయితే ఎవరెన్ని అంచనాలు వేసుకున్నా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ సీటును అత్యంత సులువుగా గెలుచుకోగలుగుతుందని నిపుణులు అంచనా. ఈ అనుకూల పరిస్థితి క్రమంలో టిక్కెట్ ఎవరికి దక్కుతుందన్న ఆసక్తి ఇప్పుడు మరింతగా పెరిగింది.ఇటీవల హైదరాబాద్ తుక్కుగూడలో జరిగిన జనజాతర సభకు వచ్చిన రాహుల్ గాంధీబస చేసిన హోటల్ కు జిల్లా నేతలను పిలిచి ఖమ్మం టికెట్ విషయంపై క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. కాగా గత నెల 31వ తేదీన దిల్లీలో జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఖమ్మం సీటు విషయంపై జరిగిన చర్చల్లో ఇద్దరు పేర్లు వచ్చినప్పటికీ వారిని పక్కన పెట్టారని తెలుస్తోంది. దీంతో కొత్త వారి కోసం అన్వేషణ ప్రారంభించారని సమాచారం. అయితే ఇప్పటికే కొందరు ఆశావహులు మళ్ళీ తమ ప్రయత్నాలు ప్రారంభించారు. వారిలో వంకాయలపాటి రాజా, జట్టి కుసుమ కుమార్, రఘురాంరెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ లో చాలా కాలంగా పని చేస్తూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో పాలేరు టికెట్ ఆశించి భంగపడిన రాయల నాగేశ్వరరావు, మువ్వా విజయబాబు, మహమ్మద్ జావీద్ లాంటి వారు కూడా మంత్రుల కుటుంబ సభ్యులకు ఇవ్వకుంటే తమకు ఇవ్వాలని కోరుతున్నారు. మొత్తానికి ఖమ్మం లోక్ సభకు కాంగ్రెస్నుంచి ఎవరు అభ్యర్థి అవుతారో అనే విషయం అతి పెద్ద ఫజిల్ గా మారింది.
ఖమ్మం కాంగ్రెస్ లో కొత్త ముఖం..
- Advertisement -
- Advertisement -