జడ్చర్ల: రెండు రోజులుగా పోలీస్ స్టేషన్ లోని లాకప్ లో బంధీ అయి పోలీసులు వేసిన గింజలు తింటూ కోడిపుంజు లాకప్ లో కూత పెడుతున్న ఘటన జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. జడ్చర్ల మండలంలోని బురెడ్డిపల్లి శివారులో తరచుగా నాటు కోళ్ల దొంగతనాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో కరివేన గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కోళ్ల దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టబడడంతో ఆ వ్యక్తిని కోడి పుంజును రెండు రోజుల క్రితం పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో ఆ కోడిపుంజును తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో బయట ఉంటే కుక్కలు తినే ప్రమాదం ఉందని పుంజును లాకప్ లో కట్టేసి విచారణ చేపడుతున్నారు.
దీంతో రెండు రోజులుగా జడ్చర్ల పోలీస్ స్టేషన్ లోని లాకప్ లో పోలీసులు వేస్తున్న గింజలు తింటూ కూతలు పెడుతుండడంతో పోలీస్ స్టేషన్ కు వివిధ పనుల మీద వచ్చే ప్రజలు లాకప్ లో ఉన్న కోడిపుంజును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోడిపుంజు దొంగతనం నెపంతో ఓ వ్యక్తిని కోడిపుంజుని అదుపులోకి తీసుకుని ఉంటారని కోడిపుంజును బయట ఉంచితే కుక్కలు తినే ప్రమాదం ఉందని లాకప్ లో పెట్టి ఉంటారని పోలీస్ స్టేషన్ కు వచ్చి పోయేవారు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి. దొంగకు చిక్కిన కోడిపుంజు మాంసంగా మారాల్సింది పోయి దర్జాగా జడ్చర్ల పోలీస్ స్టేషన్ లాకప్ లో పోలీసులు చేస్తున్న గింజలు తింటూ లాకప్ లో రెండు రోజులుగా కోడిపుంజు కూతలు కూస్తుంది.