కళలకు నిలయం కోరుట్ల
సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ ‘తేజ
ముగిసిన భారతీ సాహిత్య సమితి స్వర్ణోత్సవాలు
కోరుట్ల,
కోరుట్ల ప్రాంతం కవులకు, కళాకారులకు నిలయమని సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్’తేజ అన్నారు. భారతీ సాహిత్య సమితి స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని కోరుట్ల పట్టణంలోని సినారే కళా భవనంలో గత 3 రోజులుగా జరుగుతున్న ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. ముగింపు సభలో ప్రధాన వక్తగా పాల్గొన్న అశోక్’తేజ మాట్లాడుతూ కోరుట్ల, మెట్ పల్లి ప్రాంతాల్లో డాక్టర్ అందె వెంకట రాజం, శ్రీగాదె శంకర కవి, మురళీ మోహనాచార్య వంటి కవి పండితులతో పాటూ ఎందరో కళాకారులు తమదైన శైలిలో ప్రతిభను కనబరిచారన్నారు. సామాజిక చైతన్యంలో సాహిత్యం పాత్ర చాలా కీలకమైందని అశోక్ తేజ అభివర్ణించారు. తల్లిదండ్రులను, గురువులను గౌరవించే సంస్కృతి పిల్లలకు చిన్ననాటి నుండే అలవాటు చేయాలని, తాను ఎంత ఎత్తుకు ఎదిగిన సాహిత్యంలో తనకు కోరుట్ల ప్రాంతం తల్లి లాంటిదని, తనకు మార్గదర్శనం చేసిన ఈ గురువులను ఎన్నటికీ మరిచిపోలేనని అశోక్’తేజ పేర్కొన్నారు. తన 30 సంవత్సరాల సినీ జీవితంలో 19 వందల సినిమాలకు 4 వేలకు పైగా పాటలు రాశానని వివరించారు. తాను సాధించిన విజయంలో ఈ ప్రాంతంలోని తన గురువుల, మిత్రుల పాత్ర తప్పక ఉందని అశోక్’తేజ తన పాత జ్ఞాపకాలను సభాముఖంగా వివరించారు. ఆనంతరం
కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ సమాజంలో కవులు, కళాకారుల సాహిత్యం మంచి ప్రభావం చూపుతుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సాహిత్యం పాత్ర గొప్పదన్నారు. ఇటీవల కాలంలో యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాలను కోల్పోతున్న విషయంగా అశోక్’తేజ ఒక సందేశాత్మక పాట రాయాలని కోరారు. కోరుట్ల ప్రాంతంలో భారతీ సాహిత్య సమితి చేస్తున్న సాహిత్య సేవలు అభినందనీయమని నర్సింగరావు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సమితి అధ్యక్ష, కార్యదర్శులు కంజర్ల రామాచార్య, బట్టు హరికృష్ణలు మాట్లాడుతూ భారతీ సాహిత్య సమితి పుట్టి 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా జరిగిన 3 రోజుల ఉత్సవాల్లో మొదటి రోజు ‘కవిగాయక సమ్మేళనం’ రెండవ రోజు ‘అష్టావధానం’ మూడో రోజు సినీ గేయ రచయిత అశోక్ తేజకు ‘స్వర్గీయ వరదాచార్యుల స్మారక పురస్కార ప్రదానం’ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కోరుట్ల ప్రాంతంలో మరింతగా సాహిత్య సేవలు అందించడానికి సమితి ఎల్లవేళలా ముందుంటుందన్నారు. ఈ సందర్భంగా సాహిత్య సమితి వ్యవస్థాపకులు స్వర్గీయ డాక్టర్ అందె వెంకటరాజం రచించిన ‘నింబగిరి నరసింహ శతకం’ అనే పుస్తకాన్ని అశోక్ తేజ, నర్సింగరావులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అందె రాజేంద్ర, రాజోజు భూమేశ్వర్, బ్రహ్మన్నగారి శంకరశర్మ, అందే శివప్రసాద్, ఆడెపు శేఖర్, కల్వకోట చంద్రప్రకాష్, రాస భూమయ్య, తత్వాది మాధవి రాజేంద్రప్రసాద్, గోనె శ్రీహరి, వనపర్తి చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.