రైతు బీమాకు 92వేల మంది దూరం
దరఖాస్తు చేసుకోని రైతులు
ఈనెల 5తో ముగియనున్న గడువు
రైతుల్లో చైతన్యం కోసం రైతుబంధు సమితి కార్యాచరణ
అతడికి రెండెకరాల భూమి ఉంది. అతడికి అవగాహన లేక రైతుబీమాకు దరఖాస్తు చేసుకోలేదు. ప్రభుత్వం గుంట భూమి ఉన్నా సరే రైతుబీమా కోసం ప్రీమియం చెల్లిస్తోంది. ఇటీవల ఆయన కుటుంబ సభ్యులు అధికారుల వద్దకు వెళ్లి రైతుబీమా కోసం అడగ్గా, సదరు రైతు పేరు మీద దరఖాస్తు, బాండ్ లేకపోవడంతో బీమా అందదని తేల్చి చెప్పారు. దరఖాస్తు విషయంలో చిన్న నిర్లక్ష్యం కారణంగా ఆ రైతు కుటుంబానికి రూ.5లక్షల బీమా అందకుండా పోయింది. అదే రైతు బీమాకు దరఖాస్తు చేసి ఉంటే ఆ కుటుంబానికి కొంత ఆసరా ఉండేది. అప్పులు తీరేవి. ఇలా జిల్లాలో చాలా మంది రైతులు రైతుబీమాపై నిర్లక్ష్యం చూపిస్తూ దరఖాస్తు చేసుకోలేదు.
రైతు అనారోగ్యంతో గానీ, ప్రమాదవశాత్తు గానీ, ఏ ఇతర కారణాలతో గానీ మృతిచెందినా అతడి కుటుంబం ఇబ్బందు లు పడకుండా ఉండేందుకు రూ.5లక్షల బీమా సొమ్ము అందుతుంది. రైతు మృతిచెందిన 10రోజు ల్లో ఆ కుటుంబానికి రూ.5లక్షలు అందుతాయి. ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన రైతు కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేలా ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. అయితే చాలా మంది రైతు లు దరఖాస్తులు చేసే విషయంలో అలసత్వం ప్రదర్శించడంతో ప్రమాదవశాత్తు మృతిచెందితే ఆ కుటుంబాలకు దిక్కులేని పరిస్థితి ఏర్పడుతుంది. రైతు ఒక్క రూపాయి చెల్లించకుండానే ప్రభుత్వ మే బీమాకు సంబంధించిన ప్రీమియం రూ.3,471చెల్లిస్తోంది. రైతు కేవలం పాస్ పుస్తకం,ఆధార్‌కార్డు జీరాక్స్‌ను అందజేస్తే వ్యవసాయశాఖ అధికారులు రైతుపేరుతో రైతుబీమాకు దరఖాస్తు చేస్తారు.
92వేల మంది రైతులు బీమాకు దూరం
జిల్లా వ్యాప్తంగా 92వేల మంది రైతులు బీమాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈ 92వేల మందిలో ఇటీవల కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన వారు 25వేల మంది రైతులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 5వ తేదీ వరకు రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వలస వెళ్లిన రైతులతో పాటు స్థానికంగానే ఉంటున్న రైతులు బీమాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 5.32లక్షల మంది రైతులు ఉన్నారు. అందులో 3,16,441 మంది రైతులు ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా, వారికి బీమా బాండ్ కూడా వచ్చింది. మిగతా 92వేల మంది రైతులు దరఖాస్తుకు దూరంగా ఉండగా, వారి కోసం ఈనెల 5వ తేదీ వరకు ప్రభు త్వం గడువు విధించింది. రైతుబీమాపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతుబంధు సమితి కార్యాచరణ రూపొందించింది. రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో మండలాలు, గ్రామాల వారీగా రైతుబంధు సమితి బాధ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి వ్యవసాయశాఖ అధికారులను సమన్వయం చేసుకుని బీమాపై అవగాహన కల్పిస్తున్నారు. రైతువేదికల ద్వారా రైతులను దరఖాస్తులు చేయించి వారికి అండగా నిలవాలని రైతుబంధు సమితి నిర్ణయించింది.
రైతుబీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి : చింతరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు
రైతుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబీమా పథకాన్ని అమలుచేస్తున్నారు. ఈ పథకానికి 18-59 ఏళ్లు నిండిన వారు అర్హులు. దరఖాస్తుకు ఈనెల 5వ తేదీ వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. దురదృష్టవశాత్తు ఎవరైన రైతు మృతిచెందితే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. రైతు మృతిచెందిన 10 రోజుల్లోనే ఆ కుటుంబానికి బీమా సొమ్ము రూ.5లక్షలు అందుతాయి. దరఖాస్తు విషయంలో రైతులు నిర్లక్ష్యం చూపకుండా సంబంధిత ధ్రువపత్రాలతో వ్యవసాయ అధికారులను కలవాలి.