పెద్దపల్లిలో నేతల సైలెంట్…
కరీంనగర్, ఏప్రిల్ 15, (వాయిస్ టుడే )
Leaders' silence in Peddapalli...
పెద్దపల్లి జిల్లా అంటే గుర్తొచ్చేది ఇద్దరు నేతలు. ఒకరు గతంలో పదేళ్లపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న దాసరి మనోహర్ రెడ్డికాగా… మరొకరు ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ రమణారావు.. గతంలో ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా వ్యవహరించేవారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచేది.నీ అవినీతి బాగోతం బయటకు తీస్తా అంటే…నీ అవినీతి అవినీతి బాగోతం కూడా బయటకు తీస్తానంటూ ఇద్దరు నిత్యం ఉప్పు-నిప్పులా ఉండేవారు. వీరిద్దరి మధ్య ఆరోపణలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో జిల్లా రాజకీయాలు హీటెక్కేవి. ఇదంతా 2023కు ముందు ఇద్దరి మధ్య జరిగిన పొలిటికల్ వార్. సీన్ కట్ చేస్తే.. 2023లో గులాబీ పార్టీ దారుణంగా ఓడిపోయింది.పదేళ్లపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా జిల్లాను ఏకచక్రాధిపత్యంగా ఏలిన దాసరి మనోహర్ రెడ్డి ఓడిపోయారు. కాంగ్రెస్ నేత చింతపల్లి విజయ రమణారావు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. కాలం మారింది. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ గెలుపుతో పెద్దపల్లి జిల్లా రాజకీయాలు కూడా ఒక్కసారిగా మారిపోయాయి.అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కయ్యానికి సై అంటూ కత్తులు దూసుకున్న ఇద్దరు నేతలు ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మనోహర్ రెడ్డి ఒక్కసారిగా దూకుడు తగ్గించారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారట. ఏదైనా పార్టీ ప్రోగ్రామ్స్ ఉంటే అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారంట. అంతేకాదు క్యాడర్ కు సైతం అందుబాటులో ఉండడంలేదట. రాజకీయంగా మునుపటిలా దూకుడును ప్రదర్శించడంలేదట.ప్రత్యర్థులపై చేసే విమర్శల్లో వాడీవేడి లేకుండా చప్పగా సాగుతున్నాయంట ఆయన ప్రెస్ మీట్లు. కనీసం పార్టీ కార్యక్రమాల్లో అయినా యాక్టీవ్ గా ఉంటున్నారంటే అదికూడా లేదట. ఒక్క ఓటమితో మనోహర్ రెడ్డి తీరులో ఇంతలా మార్పు వచ్చిందేంటి అంటూ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పదేళ్ల పాటు రాజ్యమేలిన మనోహర్ రెడ్డి.. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పైన గానీ, కాంగ్రెస్ ప్రభుత్వంపైగాని పల్లెత్తు మాట కూడా అనకుండా ఎందుకు సైలెన్స్ గా ఉంటున్నారనేదే ఇప్పుడు ఎవరికీ అంతుచిక్కడంలేదట.మాజీ ఎమ్మెల్యే సైలెన్స్ పైనే పార్టీ నేతలు తలా ఒకరకంగా చర్చించుకుంటున్నారట. 2023కు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మనోహర్ రెడ్డిపై.. చింతపల్లి విజయ రమణారావు నిత్యం ఏదో ఒక ఇష్యుపై ఆరోపణలు చేస్తుండేవారు.. భూ ఆక్రమణలు, అక్రమ దందాలపై బహిరంగంగానే విమర్శలు చేశారు. అయితే ఎన్నికల తరువాత ఇప్పుడు ఒక్కసారిగా సీన్ మారి పోయింది. పెద్దపల్లి ఎమ్మెల్యేగా చింతపల్లి విజయ రమణా రావు పెద్దపల్లి గెలవడంతో… మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మౌన ముద్రలోకి వెళ్లారు. అందుకు కారణం కూడా లేకపోలేదు అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కూడా మనోహర్ రెడ్డి భూ ఆక్రమణల భాగోతం బయట పెడతానంటూ ఎమ్మెల్యే విజయ రమణా రావు హెచ్చరించారు. బంధంపల్లి చెరువుతో పాటు, మనోహర్ రెడ్డికి సంబంధించిన స్కూళ్లు, హాస్టళ్ల లెక్కలు తీస్తానంటూ బహిరంగంగానే ప్రకటించారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యే పై విమర్శలు చేస్తే..తనకే నష్టం జరుగుతుందని భావించి మాజీ ఎమ్మెల్యే సైలెన్స్ అయ్యారనే గుసగుసలు జిల్లా రాజకీయవర్గాల్లో విన్పిస్తున్నాయి.ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత మనోహర్ రెడ్డి భూ ఆక్రమాణలు బయట పెడతా.. విద్యా సంస్థలను కొలిపిస్తానంటూ హాట్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే విజయ రమణరావు కూడా ఒక్కసారిగా సైలెన్స్ అయ్యారంట. మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మౌనంపై వహించడం వెనుక ఏం జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష నాయకుడి నుండి అధికారం చేపట్టే వరకు విజయ రమణ హెచ్చరికలకే పరిమితమవడం వెనుకున్న మతలబు ఏంటనే సందేహలు జిల్లా రాజకీయ నేతల్లో వ్యక్తమవుతున్నాయంట.ఇద్దరి మధ్య రాజీ ఏమైనా కుదిరిందా అంటూ రకరకాల పొలిటికల్ గాసిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయంట. మరి భూ ఆక్రమణదారుల భరతం పడతానంటూ ఎమ్మెల్యే చేసిన శపథం.. మాజీ ఎమ్మెల్యే సైలెన్స్‌గా ఉండేంత స్థాయికి వెళ్లడం వెనుక ఏదో మతలబు జరిగే ఉంటుందంటూ పెద్దపల్లి రాజకీయ వర్గాలు సెటైర్లు వేసుకుంటున్నారట. మరి రాబోయే రోజుల్లో కూడా వీరిద్దరి మధ్య ఇలాగే సైలెన్స్ వాతావరణం కంటిన్యూ అవుతుందా లేక ఏదైనా వ్యవహారం బెడిసికొట్టి మళ్లీ మొదటికొస్తుందా అనేది వేచి చూడాలి.